Hanuma Vihari: విహారికి విపక్షాల మద్దతు

రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఇకపై ఆంధ్రా క్రికెట్ సంఘం తరఫున ఆడకూడదని నిర్ణయించుకున్న హనుమ విహారికి విపక్షాలు మద్దతు తెలిపాయి. వైకాపా నేత కుమారుడి కోసం అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌ను ఆంధ్ర జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించడమేంటని విపక్ష నేతలు మండిపడ్డారు. ఏసీఏకి భారత క్రికెటర్ కంటేవైకాపా నేతే ముఖ్యమాఅని నిలదీశారు. విహారిపై రాజకీయ వేధింపులు ఖండిస్తూ ఎక్స్‌లో ట్వీట్లు వెల్లువెత్తాయి.
భారత క్రికెటర్, ఆంధ్రా రంజీ జట్టు మాజీ కెప్టెన్ హనుమ విహారి వ్యవహారంలో ఏసీఏ వైఖరిని విపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. వైకాపా రాజకీయ కక్షలకు ఆంధ్రా క్రికెట్ సంఘం లొంగిపోవడం సిగ్గుచేటని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిభావంతుడైన విహారిని ఆంధ్రప్రదేశ్ తరపున ఎప్పటికీ ఆడనని శపథం చేసేలా వేధించారని ధ్వజమెత్తారు. విహారికి అండగా ఉండి న్యాయం జరిగేలా చూస్తామని ఎక్స్ వేదికగా హామీ ఇచ్చారు. ఆట పట్ల అతనికి ఉన్న చిత్తశుద్ధిని వైకాపా కుట్ర రాజకీయాలు నీరుగార్చలేవన్నారు. అన్యాయమైన చర్యలను ప్రజలు ప్రోత్సహించరని... చంద్రబాబు స్పష్టం చేశారు. అధికార పార్టీ రాజకీయ జోక్యంతో ఆంధ్రా క్రికెట్ నుంచి విహారి చేదు నిష్క్రమణ ఆశ్చర్యం కలిగిస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. రెండు నెలల్లోనే ఆంధ్ర తరఫున తిరిగి ఆడటానికి రావాలని విహారిని ఆహ్వానించారు. విహారికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతామనిఎక్స్ వేదికగా తెలిపారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్టులో విహారి కనబరిచిన క్రీడా పటిమ మరువలేనిదని పవన్ కల్యాణ్ కొనియాడారు. విరిగిన చేతితో పాటు మోకాలి గాయంతో ఆడిన విహారి భారత జట్టు కోసం, మరీ ముఖ్యంగా ఆంధ్రా జట్టు కోసం తన క్రీడా శక్తినంతటినీ ధారపోశారని ఎక్స్ వేదికగా గుర్తు చేశారు. అలాంటి ఆటగాడు ఒక వైకాపా కార్పొరేటర్ వల్ల ఆంధ్రా జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆరోపించారు. మన రాష్ట్ర క్రికెట్ టీమ్ కెప్టెన్‌ని దారుణంగా అవమానించి..... ఆడుదాం ఆంధ్ర లాంటి కార్యక్రమాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి లాభమేంటని సీఎం జగన్‌ని జనసేనాని ప్రశ్నించారు.
వైకాపా నేతలు క్రీడలపై కూడా దౌర్భాగ్య రాజకీయాలు, అధికార మదాన్ని చూపుతున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. ఆడుదాం ఆంధ్ర అంటూ రెండు నెలలు సినిమా స్టంట్స్ చేయించిన వైకాపా నేతలు అసలు ఆడుతున్న ఆటలు ఇవేనా అని ఎక్స్‌లో నిలదీశారు. ఆటగాళ్ల భవితను, ఆత్మవిశ్వాసాన్ని ఇలా నాశనం చేస్తారా అని ప్రశ్నించారు. ఇది ఆంధ్ర క్రికెట్ సంఘమా లేకఅధ్వానపు క్రికెట్ సంఘమా అని మండిపడ్డారు.
వుయ్ స్టాండ్ విత్ హనుమ హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా కొన్ని గంటల పాటు ఎక్స్‌లో 2వ స్థానంలో ట్రెండ్ అయింది. తెలుగుతేజం విహారిపై వైకాపా నేతల వేధింపులను ఖండిస్తూ ఎక్స్ వేదికగా వేల సంఖ్యలో నెటిజన్లు ట్వీట్లు వేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com