VZM Sirimanotsavam: వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం

ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా జరిగింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులను కళాకారులు ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆనవాయితీ ప్రకారం పైడితల్లి ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానుపై ఆశీనులయ్యారు. భక్తులు అమ్మవారి ప్రతిరూపంగా భావించి పూజారి కాళ్లకు మొక్కారు.
విజయనగర ప్రజల ఇలవేల్పైన శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి భక్తులు పోటెత్తారు. పైడితల్లి అమ్మవారు అంటే ఉత్తరాంధ్ర వాసులకు ఒక విశ్వాసం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. అంతటి విశ్వాసం ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అమ్మవారి పండుగను అంగరంగ వైభవంగా జరిపారు. ఎప్పటిలాగే పాలధార, అంజలి రథం, తెల్ల ఏనుగు, బెస్తవారి వల ముందు నడవగా పైడితల్లి అమ్మవారి సిరిమాను మూడుసార్లు విజయనగరం పురవీధుల్లో ఊరేగి, భక్తులకు దర్శనమిచ్చారు. మూడు లాంతర్ల జంక్షన్ లోని చదురు గుడి నుండి తన పుట్టినిల్లు అయిన విజయనగరం కోటవద్దకు వెళ్లి రాజ కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించిన భక్తులు పరవశించిపోయారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని తిలకించటానికి ఉత్తరాంద్ర జిల్లాల నుండి పెద్దఎత్తున భక్తులు వచ్చి మొక్కులు చెల్లించారు. ఆ తర్వాత భక్తుల జయజయధ్వానాల నడుమ సిరిమాను ఊరేగింపుసాగింది. తన పుట్టినిల్లు విజయనగరం కోటవద్దకు వెళ్లి పూసపాటి వంశీయుల రాజా కుటుంబాన్ని ఆశీర్వదించారు. అలా మూడుసార్లు ఊరేగి రాజకుటుంబానికి దీవెనలు అందించారు.
సంప్రదాయభద్దంగా పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం బెస్తవారివల సిరిమానుకు ముందు నడిచాయి. ఉత్తరాంధ్ర కళాకారుల వివిధ వేషధారణల్లో ఉత్సవంలో ఆకట్టుకున్నారు.ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఒడిశా నుంచీ భక్తులు పెద్ద సఖ్యలోతరలొచ్చారు. ఎత్తైన భవంతులు ఎక్కి సిరిమానోత్సవాన్ని తిలకించారు. కోట కూడలి వద్ద చిన్నపాటి తోపులాట తప్ప పైడితల్లి సిరిమానోత్సవం ఈ ఏడాది...ప్రశాంతంగానే ముగిసింది. మాన్సాస్ ఛైర్‌పర్సన్, పైడితల్లి ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, వారి కుటుంబ సభ్యులు కోట బురుజు పైనుంచి సిరిమాను ఉత్సవాన్ని తిలకించి పరవశించారు.
పైడితల్లి అమ్మవారి సిరిమానొత్సవాన్ని ఈ ఏడాది సకాలంలో పూర్తి చేశారు. మంత్రి బొత్స ఆధ్వర్యంలో మొదట్లోనే రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, పురప్రముఖులతో సమవేశాన్ని నిర్వహించి, ఉత్సవాలపై వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, దానికి అనుగుణంగా అమ్మవారి సిరిమాను పండుగను నిర్వహించారు.
ఉత్సవానికి అమ్మవారి సిరిమానును, ఇతర రథాలను ముందుగానే ఆలయం వద్దకు తీసుకురావడంతో, సాయంత్రం 4.37 నిమిషాలకు సిరిమాను రథోత్సవం ప్రారంభమయ్యింది. తోపులాటలు జరగకుండా, ఉత్సవానికి అంతరాయం కలుగకుండా పటిష్టమైన బారికేడ్లను ఆర్అండ్‌బి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా, పలు చోట్ల తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. త్రాగునీటి సదుపాయం కల్పించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com