పంచాయతీ ఎన్నికలకు రేపే తొలి దశ పోలింగ్

పంచాయతీ ఎన్నికలకు రేపే తొలి దశ పోలింగ్
తొలి దశలో ఎన్నికల్లో చాలా జిల్లాల్లో సర్పంచి స్థానానికి గట్టి పోటీ నెలకొంది.

పంచాయతీ ఎన్నికలకు తొలి దశ పోలింగ్ రేపే జరగనుంది. రాష్ట్రంలో తొలివిడత ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం ముగిసింది. రేపు ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు పోలింగ్‌ జరగనుంది. రేపు మధ్యాహ్నం పోలింగ్‌ పూర్తికాగానే.. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఫలితాల ప్రకటన తరువాత ఉపసర్పంచ్‌ ఎంపికకు ఓటింగ్‌ నిర్వహిస్తారు. విజయనగరం జిల్లా మినహాయించి మిగిలిన 11 జిల్లాల్లో 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 513 సర్పంచ్‌, 8వేల748 వార్డులు ఏక గ్రీవమయ్యాయి. దీంతో 2వేల 738 సర్పంచ్‌, 10వేల 663 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగనున్నా యి. తొలివిడత పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 33వేల 193 పోలింగ్‌ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. తొలి దశలో ఎన్నికల్లో చాలా జిల్లాల్లో సర్పంచి స్థానానికి గట్టి పోటీ నెలకొంది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు.

తొలి విడత పంచాయతీ ఎన్నికల కోసం బ్యాలెట్‌ పేపర్లు, స్వస్తిక్‌ మార్క్‌, రబ్బర్‌స్టాంపులు, ఇండెలిబుల్‌ ఇంక్‌, ఇతర పోలింగ్‌ సామాగ్రి మొత్తం ఆయా కేంద్రాలకు ఇవాళ మధ్యాహ్నం కల్లా చేరాలని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. పోలింగ్‌ సిబ్బంది ఇవాళ రాత్రికే ఆయా గ్రామ పంచాయతీలకు సామగ్రితో చేరుకోవాలని ఆదేశించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద బారికేడ్లతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని.. ఓట్ల లెక్కింపు రాత్రంతా జరిగేట్లయితే తగినన్ని లైట్లు ఏర్పాటు చేసుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ అధికారులకు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామాల్లో విధులకు హాజరయ్యే మహిళా ఉద్యోగుల కోసం స్థానిక ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్త, వాలంటీర్లను సహాయకులుగా పెట్టాలన్నారు. పురుష సిబ్బందికి వీఆర్‌వో, సిబ్బందిని సహాయకులుగా ఉంచాలని ఆదేశాలిచ్చారు.

వైసీపీ నేతలు మేజర్ పంచాయతీల్లో ఓటుకు 3 నుంచి 5 వేలు, మైనర్‌ పంచాయతీల్లో 2 వేలు చొప్పున ఓటర్లకు పంచుతున్నారన్నారు టీడీపీ నేత దేవినేని ఉమ. వాలంటీర్ల ద్వారా విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరుగుతోందని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు సమస్యాత్మక గ్రామాలకు అదనపు బలగాలను పంపించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఎమ్మెల్సీ అశోక్‌బాబు లేఖ రాశారు. చిత్తూరు జిల్లా నగరిలో సీఐ అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ, టీడీపీ శ్రేణుల్ని బెదిరిస్తున్న విషయాన్ని ఆడియో క్లిప్పింగ్‌లతో సహా అందజేశారు. పుంగనూరు నియోజకవర్గం సోడం మండలంలో నో డ్యూస్‌ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్న విషయం, కృష్ణాజిల్లా కంచర్ల గ్రామంలో టీడీపీ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్ధి వాహనాన్ని ధ్వంసం చేసిన విషయాలను ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.


Tags

Next Story