Vijayawada Floods : చుట్టూ క‘న్నీళ్లే
బుడుమేరు వరద నుంచి బెజవాడ తేరుకోకముందే.. కృష్ణా నదికి మరోసారి వరద పోటెత్తింది. తెలంగాణలో కురిసిన భారీవర్షాల ప్రభావంతో సోమవారం ఓ దశలో ప్రకాశం బ్యారేజీ వద్ద 11.43 లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కృష్ణా నదికి ఇరువైపుల ఉన్న లంక గ్రామాలు నీటిలో మునిగాయి. వారిని అధికారులు హుటాహుటిన ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలకు తరలించారు.
కొద్దిగా సమయం ఇవ్వండి... చక్కదిద్దుతాం
సీఎం చంద్రబాబు సహాయ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆయన వరద ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వానికి కొద్దిగా సమయం ఇవ్వాలని, పరిస్థితులు చక్కదిద్దుతామని బాధితులకు విజ్ఞప్తి చేశారు. అలాగే వరద సహాయక చర్యలపై మంత్రి లోకేశ్ విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిరంతరం సమీక్షించారు. వరద సహాయక చర్యల్లో పెద్దఎత్తున పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంత్రులందరూ వరద ప్రాంతాల్లోనే ఉండి సహాయక చర్యలను వేగవంతం చేశారు. ప్రతి డివిజనుకు ఓ ఐఏఎస్ అధికారిని ఇన్‌ఛార్జిగా నియమించారు. హెలికాప్టర్, డ్రోన్ల ద్వారా ఆహారం, మందులు, మంచినీటి సరఫరా చేస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మందికి సురక్షితంగా ఆహారాన్ని అందించేందుకు డ్రోన్లను వినియోగించారు. సాయం అడిగిన వెంటనే సిబ్బందిని ఆయా ప్రాంతాలకు పంపిస్తున్నారు. అక్షయ పాత్ర సంస్థ ద్వారా లక్ష మందికి, హోటల్స్ అసోసియేషన్ వారు మరో లక్ష మందికి భోజనాలు అందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సోమవారం 20 పవర్ బోట్లు వచ్చాయి.
నీట మునిగిన పంటలు.. నిలిచిన వాహనాలు
అరటి, కంద, పసుపు, చామ, కూరగాయ పంటలన్నీ నీటమునిగాయి. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణమ్మ కరకట్ట అంచులను తాకుతూ ప్రవహిస్తోంది. తెనాలి, రేపల్లె నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్న కరకట్టలకు మట్టి, ఇసుక బస్తాలు వేశారు. పెదపులివర్రు, రావిఅనంతవరం, ఓలేరు ప్రాంతాల్లో గండ్లు పడే ప్రమాదం ఉండటంతో స్థానికులు ఆందోళన చెందారు. రామలింగేశ్వరనగర్, కృష్ణలంక ప్రాంతాల్లోకి వరద పోటెత్తింది.
దీంతో విజయవాడ నుంచి వరంగల్, హైదరాబాద్ వైపు వెళ్లేందుకు కొన్ని రైళ్లను మాత్రమే అనుమతించారు. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిపివేసి గుంటూరు, పిడుగురాళ్ల మీదుగా మళ్లించారు. ఖమ్మం వైపు వెళ్లే బస్సులను నిలిపేశారు.
ఇంకా వరదలోనే సింగ్ నగర్
బుడమేరు ఉద్ధృతికి నీట మునిగిన సింగ్‌నగర్ ప్రాంతంలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. ఐదారు అడుగుల ఎత్తున నీరు నిలిచింది. పడవలు ఏర్పాటు చేసి కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించినా, అధికశాతం మంది ఇంకా పై అంతస్తుల్లో భయంతో గడుపుతున్నారు. బయటకు రావాలంటే పడవలు కూడా లేవు. విద్యుత్తు లేదు. తాగునీరు నిండుకుందని వాపోతున్నారు. సీఎం సింగ్‌నగర్‌తోపాటు కృష్ణలంక, భవానీపురం, ప్రకాశం బ్యారేజీ, యనమలకుదురు, పడమట ప్రాంతాలకు వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com