Vishaka: దసపల్లా హోటల్‌లో జనవాణి కార్యక్రమం

Vishaka: దసపల్లా హోటల్‌లో జనవాణి కార్యక్రమం
X
ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న పవన్‌ కల్యాణ్‌

జగన్‌ ప్రభుత్వం కష్టాల్లో ఉన్నవారి సమస్యలు తీర్చకపోగా.. వారిపై కేసులు పెట్టి వేధిస్తోందని పవన్‌ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. న్యాయం చేయాలని బాధితులు కోర్టులుకు వెళ్తే కేసు ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని మండిపడ్డారు.. వైసీపీ ప్రభుత్వానికి కనీసం మానవత్వం కూడా లేకుండా పోయిందని పవన్‌ కళ్యాణ్ మండిపడ్డారు.. ఉత్తరాంధ్రలో పర్యటనలో భాగంగా విశాఖ జనవాణి కార్యక్రమంలో ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు పవన్‌ కళ్యాణ్‌..

ఎల్జీ పాలిమర్స్‌ చేసిన ఘోరానికి కన్న బిడ్డ చనిపోయిన బాధలో ఉన్న తల్లిపై కేసు పెట్టడం న్యాయమా అని ప్రశ్నించారు పవన్‌కళ్యాణ్‌.. బిడ్డ చివరి చూపు కూడా నోచుకోని తల్లిపై తప్పుడు కేసులు పెట్టే సాహసం వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. అన్నం తింటున్నారా లేదంటే ఇంకేమైనా తింటున్నారా?.. వైసీపీ నేతలు మనుషులేనా అని పవన్‌ కళ్యాణ్‌ మండిపడ్డారు. ఈ అన్యాయాలను వైసీపీ మహిళా నేతలు కూడా చూడాలి...సీఎం సతీమణి గారు మీరు కూడా గమనించాలన్నారు పవన్‌ కళ్యాణ్‌. తల్లికి ఎలాగో న్యాయం చేయలేకపోయారు..తప్పుడు కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

తమ కూతురు అదృశ్యమైనా పోలీసులు పట్టించుకోవడంలేదంటూ అమలాపురం పట్టణానికి చెందిన తల్లిదండ్రులు.. పవన్‌ కళ్యాణ్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఏపీలో ఏడాదికి 30వేల మంది అమ్మాయిలు అదృశ్యమవుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు పవన్‌కళ్యాణ్‌.. హైకోర్టులో వేసిన రిట్‌ పిటిషన్లను వెనక్కి తీసుకోవాలని ఎందుకు బెదిరిస్తున్నారు ఈ నేరాల్లో వైసీపీ నేతలకు ఏమైనా భాగం ఉందా అని పవన్‌ కళ్యాణ్ ప్రశ్నించారు.

తన 84 సెంట్ల భూమి కబ్జా చేశారని.. పవన్‌ కళ్యాణ్‌కు మొరపెట్టుకున్నారు విశాఖ గాజువాకకు చెందిన శ్రీనివాస్‌. ఏపీలో భూకబ్జాలు పెరిగిపోయాయని.. కరోనా సమయాన్ని కూడా భూదందాకు వాడుకున్నారని పవన్‌ కళ్యాణ్‌ ఆరోపించారు.. 2004 నుంచి 2012 వరకు తెలంగాణలో కబ్జాలు పెరిగాయని.. ఇప్పుడు ఏపీలోనూ ఆ విష సంస్కృతి పెచ్చుమీరిందన్నారు.

జనవాణి కార్యక్రమంలో మానసిక దివ్యాంగులను కలిశారు పవన్‌ కళ్యాణ్‌... దివ్యాంగుల సమస్యలను స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు వివరించారు.. ఎంతో మంది పిల్లలను నడిరోడ్డుపై వదిలేస్తున్నారని దివ్యాంగుల చట్టం ఉన్నా అమలు కావడం లేదన్నారు పవన్‌ కళ్యాణ్‌.. దివ్యాంగుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

జనసేన సభ్యత్వం ఉండి రోడ్డుప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు సాయం అందజేశారు పవన్‌ కళ్యాణ్‌.. 5 కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు..


Tags

Next Story