AP: తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. ఇటీవల వీరి కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అన్నా లెజినోవా తిరుమల వచ్చారు. ఇతర మతానికి చెందిన వ్యక్తి కావడంతో నిబంధనల ప్రకారం హిందూ మతాన్ని గౌరవిస్తున్నానని, తనకు పూర్తి విశ్వాసాలు ఉన్నాయని పేర్కొంటూ డిక్లరేషన్‌పై ఆమె సంతకం చేశారు. అనంతరం క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ వరాహస్వామిని దర్శించుకున్నారు. అక్కడినుంచి నేరుగా పద్మావతి కల్యాణకట్టకు వెళ్లి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
సుప్రభాత సేవలో...
తలనీలాల సమర్పణ అనంతరం అన్నా లెజినోవా తిరిగి అతిథిగృహానికి చేరుకుని రాత్రి బస చేశారు. వేకువ జామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలను అధికారులు అందజేశారు. అంతకుముందు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద అధికారులు స్వాగతం పలికారు. అన్నదానానికి విరాళం ఇవ్వనున్నారు.పవన్ తన కుటుంబసభ్యులతో కలసి హైదరాబాద్ చేరుకున్నారు.
హైదరాబాద్‌కు పవన్...
డిప్యూటీ సీఎం ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన తనయుడు మార్క్ శంకర్ గాయపడి, అక్కడి ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకుంటున్నారు. పవన్, ఆయన సతీమణి అన్నా లెజినోవా, కూతురు పొలెనా అంజనా పవనోవా, మార్క్ శంకర్‌తో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మార్క్ శంకర్ ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉందని పవన్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ప్రమాదం నుంచి తన తనయుడు కోలుకోవాలని ఆకాంక్షించిన రాజకీయ నాయకులు, జనసేన సభ్యులు, అభిమానులు, కుటుంబసభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com