Pawan Kalyan : ZPTC ఉప ఎన్నికల విజేతలకు పవన్ అభినందనలు

Pawan Kalyan : ZPTC ఉప ఎన్నికల విజేతలకు పవన్ అభినందనలు
X

ZPTC ఉప ఎన్నికల విజేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. పులివెందుల, ఒంటిమిట్ట మండలాల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో– కూటమి బలపరచిన తెలుగుదేశం అభ్యర్థులు సాధించిన విజయం కచ్చితంగా ఆయా మండలాల ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఆయా మండలాల్లో విజయం సాధించిన శ్రీమతి లతారెడ్డి, శ్రీ ముద్దుకృష్ణా రెడ్డిలకు హృదయపూర్వక అభినందనలు. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో.. కనీసం నామినేషన్ కూడా వేయనీయలేదు. నామినేషన్ వేద్దామనుకొన్నవారిపై దాడులు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఏకగ్రీవాలకు వెసులుబాటు ఉంది కానీ... ఏకపక్షంగా సాగినప్పుడు ప్రజాస్వామ్యబద్ధమైన తీర్పు రాకపోవచ్చు. పులివెందులలో పోటీ ఉండటం వల్లే... ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్ళి తమ తీర్పు వెల్లడించారు. ఇప్పటి వరకూ ఏకగ్రీవం పేరుతో ఎవరూ పోటీలో లేకుండా చేసుకొంటూ వచ్చారు. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలలో పోటీకి ఆస్కారం కలిగింది. మూడు దశాబ్దాల తరవాత స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు నచ్చినవారికి ఓటు వేసుకోగలిగామని పులివెందుల ఓటర్లు చెప్పారు అంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో రాష్ట్రమంతా అర్థం చేసుకొంటోంది. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నియమావళి ప్రకారం నామినేషన్ల ప్రక్రియ సాగింది. అభ్యర్థులు ప్రచారాలు చేసుకొన్నారు. పోలింగ్ సాగింది. ఎన్నికల నిర్వహణ మూలంగా ప్రజా తీర్పు స్పష్టంగా వెలువడింది. ఈ ప్రక్రియ ఇష్టం లేని పార్టీ ప్రతి దశలో కవ్వింపు చర్యలకు దిగింది. ఎన్నికలు సాగటం నచ్చక, అసహనంతో ప్రభుత్వంపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు సంయమనంతో వ్యవహరించారు. పోలింగ్ సందర్భంలో హింసకు తావు లేకుండా చర్యలు చేపట్టిన పోలీసు అధికారులు, సిబ్బంది, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు అభినందనలు తెలియచేస్తున్నాను.

Tags

Next Story