PAWAN: దెబ్బతిన్న పంటలను పరిశీలించిన డిప్యూటీ సీఎం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో పర్యటించారు. ‘మొంథా’ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్ కార్యక్రమాలను మొదలుపెట్టాలని ఆదేశించారు. తుపాను ప్రభావం వల్ల పాడైన రోడ్లను ప్రాధాన్య ప్రకారం బాగు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యలను తక్షణమే మొదలుపెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు.
బాధితులకు అండగా ఉంటాం
ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి, అన్ని విధాల సహాయం అందిస్తుందని పవన్ హామీ ఇచ్చారు. రైతుల పంట నష్టాలపై అధికారులను సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే మొంథా తుఫాన్ ప్రభావంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేల ఎకరాల వ్యవసాయ భూమి దెబ్బతిన్నట్లు అంచనా. కేవలం కృష్ణా జిల్లాలోనే 2.5 లక్షల ఎకరాల్లో వరి పంట తీవ్రంగా నష్టపోయింది. అరటి, బొప్పాయి గాలివానతో నేలమట్టమయ్యాయి. తుఫాన్ తాకిడితో చెరువుల్లా మారిన పొలాల దృశ్యాలు హృదయవిదారకంగా మారాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తగిన పరిహారం అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా.. ఇతర మంత్రులు ఈ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సీఎం చంద్రబాబు ముందు జాగ్రత్తతో తుపాను వల్ల జరిగే నష్టం అధికంగా జరగకుండా చూశామని అన్నారు. భారీ వర్షాల కారణంగా 46 వేల హెక్టార్లలో పంట నష్టం వచ్చిందని, దీంతో 56 వేల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని, వీరిలో అత్యధికంగా కౌలురైతులే ఉన్నారని, వారందరిని ఆదుకునేందుకు సీఎం చంద్రబాబుతో రివ్యూ మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

