PAWAN: జంతు సంరక్షణకు "హనుమాన్"

ప్రకృతి సమతుల్యత కాపాడటం మన అందరి బాధ్యత అని స్పష్టం చేస్తూ, వన్యప్రాణుల సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మనుషులు–జంతువుల మధ్య పెరుగుతున్న సంఘర్షణను తగ్గించేందుకు రాష్ట్ర అటవీశాఖను మరింత బలోపేతం చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ‘హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టు’ను ప్రారంభించారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలకు పర్యావరణ వేత్తలు, అటవీశాఖ అధికారులు, జంతు ప్రేమికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వన్యప్రాణుల నుంచి మనుషులను రక్షించడమే కాకుండా, జంతువుల సహజ నివాసాలను కాపాడటం కూడా ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. అడవుల్లో నివసించే జంతువులు జనారణ్యంలోకి రాకుండా టెక్నాలజీ ఆధారంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ‘హనుమాన్’ ప్రాజెక్టు ద్వారా అటవీశాఖ పనితీరును మరింత సమర్థవంతంగా మార్చనున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు కింద 100 ప్రత్యేక వాహనాలను అటవీశాఖకు అందజేశారు. అదనంగా వన్యప్రాణుల అత్యవసర వైద్యం, రక్షణ చర్యల కోసం ప్రత్యేక అంబులెన్స్‌లను అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 19 అత్యవసర సహాయ బృందాలను సిద్ధం చేసినట్లు తెలిపారు.
అలాగే ఏడు ప్రాంతాల్లో అత్యవసర చికిత్స, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో అలర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అడవి ఏనుగుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. చిత్తూరు జిల్లా సహా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగుల సమస్యను సమర్థంగా ఎదుర్కొన్నామని, అవసరమైతే కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తెచ్చి పరిస్థితిని నియంత్రించినట్లు వివరించారు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌ను కూడా ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. దీని ద్వారా అడవి జంతువుల కదలికలను పర్యవేక్షించి ముందస్తు హెచ్చరికలు జారీ చేయవచ్చని అధికారులు తెలిపారు. మనుషులు–వన్యప్రాణుల మధ్య సంఘర్షణ తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ భూమిపై మనుషులతో పాటు జంతువులకూ సమాన హక్కు ఉందని, ప్రకృతిని కాపాడటం అంటే భవిష్యత్ తరాలకు భద్రత కల్పించడమేనని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వన్యప్రాణుల దాడుల్లో గాయపడిన లేదా మరణించిన వారికి నాలుగు కోట్ల రూపాయల పరిహారం చెల్లించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు. హనుమాన్ ప్రాజెక్టును పకడ్బందీగా రూపొందించిన అటవీశాఖ అధికారులను పవన్ కళ్యాణ్ అభినందించారు. స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యాన్ని కూడా తీసుకుంటామని ప్రకటించారు. మొత్తంగా, వన్యప్రాణి సంరక్షణలో సాంకేతికతను వినియోగిస్తూ, అటవీశాఖను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పవచ్చు. మనుషులు, జంతువులు సహజీవనం చేసే వాతావరణం సృష్టించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు అమలు అవుతుండగా, ఇది రాష్ట్ర అటవీశాఖ చరిత్రలో కీలక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
