PAWAN: నేను లెఫ్టిస్టూ కాదు.. రైటిస్టూ కాదు

తనను చాలామంది లెఫ్ట్ భావాలు వదిలేసిన వ్యక్తిగా పేర్కొంటారని.. కానీ తానెప్పుడూ లెఫ్టిస్టు కాదు... అలాగనీ రైటిస్టూ కాదని.. తాను ఎప్పుడూ ఒకేలా ఉంటానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. తాను ఒకేలా ఆలోచిస్తాను. వామపక్షవాదులు రాసిన పుస్తకాలు చదివానని వెల్లడించారు. జాతీయవాద భావాలు ఉన్న పుస్తకాలు సైతం చదువుతానని... భారతీయ సంస్కృతి, మన ధర్మం గురించి తెలుసుకుంటానని పవన్ అన్నారు. దేశ భక్తి విషయంలో తనకు స్పష్టమైన అభిప్రాయం ఉందని... బయటకు వెళ్లినప్పుడు కూడా విభిన్న రకాల పుస్తకాలను వెతికి కొంటానని వెల్లడించారు. ఎందుకంటే ప్రతి పుస్తకం విలువైనదేనని... మనకు పుట్టుకతోనే దేశభక్తి రావాలని కోరుకునే వ్యక్తిని తాను అని అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లివారి కళాక్షేత్రంలో జరిగిన ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన నవల తెలుగు అనువాద రూపం ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తకాన్ని తెలుగులో సీనియర్ జర్నలిస్ట్ ఎ.కృష్ణారావు అనువదించారు. ‘స్త్రీ శక్తి అసమాన్యమని.. సూర్యుడిని సైతం మింగేయగలిగేంత అమోఘమైన శక్తి వారి సొంతమని పవన్ అన్నారు.
తనకు పుస్తకాలు చదవడం చిన్నప్పటి నుంచి అలవాటు అని, మొదటగా తనకు మా అమ్మ బుచ్చిబాబు రాసిన ‘చివరకు మిగిలేది’ అనే పుస్తకం ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. ఆమె సూర్యుడిని కబళించింది అనే పుస్తకం రాసిన లక్ష్మీ ముర్డేశ్వర్ పురి అత్యున్నత పదవులు నిర్వహించి, మరో వైపు పుస్తకాలు రాయడం గొప్ప విషయం అని ప్రశంసించారు. "లక్ష్మీ పురి రాసిన ఆమె సూర్యుడిని కబళించింది పుస్తకం భారతీయ మహిళల శక్తిని చాటి చెబుతుంది. ఈ పుస్తకంలో మాలతి అనే పాత్రను వర్ణించడం, ఆ పాత్రను బలంగా ముందుకు తీసుకువెళ్లడంలో శ్రీమతి లక్ష్మీ పురి గారి రచనా శక్తి గొప్పగా అనిపిస్తుంది. చదివించేలా ఆమె రచనా శైలి ఉంటుంది. అందరిలో ఉత్సుకతను రేపేలా పుస్తకానికి పేరు పెట్టడం విశేషం. భారత వ్యవస్థ పూర్తిగా మాతృస్వామ్య వ్యవస్థ. స్త్రీని గౌరవించుకోవడంలో, ఆమెను పూజించడాన్ని భారతీయులు గొప్పగా భావిస్తారు. పుస్తకం విషయానికి వస్తే పీకా అనే యువకుడు మాలతి, కమలలను ఏడిపిస్తూ ఉండడం, దానికి బలంగా మాలతి స్పందించడంతో మొదలై.. ఆమె శక్తి మరింత పెంపొందేలా పుస్తక రచనను తీసుకువెళ్లారు. ఇది ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం ‘ఆమె సూర్యుడిని కబళించింది’ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com