PAWAN: స్మగ్లింగ్ స్వచ్ఛందంగా ఆపకపోతే..ఎలాంటి చర్యలకైనా వెనుకాడం

ఆపరేషన్ కగార్‌ను అమలు చేస్తున్న ఈ దేశంలో.. ఎర్ర చందనం స్మగర్ల ఆట కట్టించడం పెద్ద లెక్క కాదని డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరించారు. స్మగ్లింగ్ స్వచ్ఛందంగా ఆపకపోతే.. ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో అటవీ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎర్రచందనం చెట్టు వెనుక ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. వేంకటేశ్వరస్వామి గాయం నుంచి పుట్టిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణాపై జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించాం. శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు దాదాపు 2లక్షల ఎర్రచందనం చెట్లు కొట్టేసి ఉంటారని అధికారుల అంచనా. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశాం. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఏపీ, కర్ణాటక మధ్య ఒప్పందం చేసుకుందామని కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కోరాం. ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లింగ్స్ చేస్తున్న నలుగురు కింగ్ పిన్స్‌ను గుర్తించాం. వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టాం.” అని తెలిపారు.
8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఎ, బి. సీ, నాన్ గ్రేడ్ ల వారీగా దుంగల వివరాలపై ఆరా తీశారు. ప్రతి గోడౌన్ లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రికార్డులు పరిశీలించారు. ప్రతి ఎర్ర చందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవకూడదని అటవీశాఖ అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. అడవిలో నాలుగు కిలోమీటర్లు పైగా ప్రయాణించిన ఆయన… రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టును పరిశీలించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలను పరిశీలించిన పవన్ కల్యాణ్…. అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

