pawan: మీరు కోస్తామంటే.. మేం చూస్తూ ఉంటామా

కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో తప్పొప్పులు ఉంటే చెప్పాలని.. వాటిని సరిదిద్దుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. మార్కాపురం మండలం నరసింహాపురం వద్ద రూ. 1290 కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులకు శంఖుస్థాపన చేసి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ప్రకాశం జిల్లాలో తాగునీటి కోసం చేపడుతున్న అతి పెద్ద ప్రాజెక్టు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దీని ద్వారా దాదాపు 10 లక్షలకు పైగా జనాభాకు తాగునీటిని అందించబోతున్నామన్నారు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఆపేస్తున్నట్టు కేంద్రం చెప్పటంతో కేంద్ర మంత్రి పాటిల్‌ను కలిసి అన్ని విషయాలను వివరించినట్టు తెలిపారు. నీటి ఎద్దడి ప్రాంతాలకు రూ. 84 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పామన్నారు. ప్రస్తుతం జల్ జీవన్ మిషన్ మొదటి విడతగా రూ.1,290 కోట్లతో శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. ఏపీ 21 మంది ఎంపీ సీట్లు గెలుచుకోవటంతో కేంద్రానికి ఆక్సిజన్ అయ్యిందని పవన్ అభిప్రాయపడ్డారు. అందువల్లే ఏపీకి నిధులు వస్తున్నాయని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం తీరుతోనే ఏపీకి జల్ జీవన్ మిషన్ పనులకి నిధులు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. తాను, సీఎం చంద్రబాబు కేంద్రంతో చర్చలు జరపటం వల్ల నిధులు విడుదలయ్యాయని పవన్ వెల్లడించారు.
సినిమా డైలాగులు నిజజీవితంలో బావుండవు
తమ ప్రభుత్వం కక్ష తీర్చుకునేది కాదని... తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా కోపం లేదని చెప్పుకొచ్చారు. కుత్తుకలు కోస్తాం అనే వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడమని.. మీరు కొస్తామంటే మేము చూస్తూ ఉంటమని అన్నారు. మీరు మళ్లీ అధికారంలోకి ఆ పార్టీ నేతలు చెబుతున్నారని ఎలా వస్తారో చూద్దామని పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. వైసీపీ అంటున్న రప్పా రప్పా సినిమా డైలాగులపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇవి నిజజీవితంలో బాగుండవని చెప్పుకొచ్చారు. సామాన్యులను బెదిరించడం వల్లే వైసీపీకి ఈ దుస్థితి వచ్చిందని పవన్ కల్యాణ్ విమర్శించారు . దేవాదాయ, అటవీ శాఖ, ఖాళీగా కనిపించిన భూములను గత ప్రభుత్వ పెద్దలు స్వాధీనం చేసుకున్నారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ ఆక్రమణ భూములపై ప్రభుత్వం దృష్టి సారించిందని వీటికి రక్షణ కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందన్నారు. కూటమి అంటే పిడికిలి అని... అందులో ఏ వేలు లేకపోయినా ఏమీ చేయలేమని.. ఏకలవ్యుడు పరిస్థితి అవుతుందన్నారు. 15 ఏళ్లు పదవిలో నిలబెడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నా రు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com