PAWAN KALYAN: లౌకిక వాదం ముసుగులో హిందూమతంపై దాడి

ఎక్కడ ధర్మం దారి తప్పితే అక్కడే పోరాటం ఉంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కావాలనే ఉత్తరాదితో పోలుస్తూ సమస్యను పక్కదారి పట్టించడమే కాదు.. ప్రజల్లో విభజనవాదం తీసుకురావాలనే కుట్ర దాగి ఉందన్నారు. ఇలాంటి విభజన ఆలోచనలు ఉన్నవారు చాలా ప్రమాదం. ఇలాంటి వారు శివునిపై, అమ్మవారిపై కూడా ప్రశ్నలు వేస్తారన్నారు. దేశంలో ఎక్కడ ధర్మం దారి తప్పినా అక్కడ సంఘటితంగా పోరాడటం కచ్చితంగా చేయాల్సిన పని అన్నారు.
తమిళనాడులోని మధురైలో జరిగిన మురుగ భక్తర్గల్ మానాడులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మురుగన్ భక్తుడిగా పవన్ కళ్యాణ్ నడుచుకున్న తీరు అక్కడి వారిని ఆకట్టుకుంది. ఆదివారం నిర్వహించిన ఈ మానాడులో పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేశారు. 'ధర్మం అంటే ఏంటి? దుష్ట శక్తులను తొలగించడం ధర్మం. ప్రతివారినీ సమానంగా చూడటం ధర్మం. దుష్టులను శిక్షించడం ధర్మం' అని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. 'నేను పదహారు ఏటే శబరిమల వెళ్లినవాణ్ణి. థైపూసం సందర్భంగా తిరుత్తణికి భక్తుల పోటును చూశా. విభూతి పెట్టుకొని స్కూల్‌కి వెళ్లినవాడిని' అని తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు. 'ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు. ఒక ముస్లిం కూడా వారి మతాన్ని గౌరవించవచ్చు. కానీ హిందువు తన మతాన్ని గౌరవిస్తే మాత్రం అభ్యంతరం?' అని తెలిపారు. 'హిందు ధర్మాన్ని, హిందూ దేవతలను చులకన చేస్తారు. వారిది సెక్యులరిజం కాదు సూడో సెక్యులరిజం' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం పేరిట తమిళనాడులో సరికొత్త రాజకీయం మొదలుపెట్టిన పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాస్తికులను తప్పుబట్టారు. ధర్మంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ఒక ఆధ్యాత్మిక సభ అనిపించుకున్నప్పటికీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం రాజకీయంగా స్పష్టమైన సంకేతాలివ్వడం విశేషం. తమిళనాడులో హిందూ సంప్రదాయాల రక్షణను, హిందూ మతంపై పెరుగుతున్న విపరీత ధోరణులను ఎత్తి చూపుతూ – ధర్మం, సంస్కృతి, భక్తి అనే మాటలతో ఆయన మాట్లాడిన తీరు రాజకీయ స్థాయిలో పలు అర్థాలను కలిగిస్తోంది.
పవన్ వ్యూహాత్మక అడుగులు
ఈ సభ పవన్ కళ్యాణ్‌కు ద్వంద్వ ప్రయోజనం కలిగించిందనే చెప్పాలి. ఒకవైపు భక్తి భావనతో తన వ్యక్తిత్వాన్ని ప్రజలకు దగ్గర చేయడం, మరోవైపు "సూడో సెక్యులరిజం" అనే విమర్శలతో హిందుత్వ భావజాలాన్ని ప్రోత్సహించడమూ ఉంది. "హిందువుగా మతాన్ని గౌరవించటమే తప్పుగా మలిచే వారిపై గట్టి విమర్శ" ద్వారా పవన్ తన బేస్‌ను బలోపేతం చేయాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడులో బలపడాలన్న లక్ష్యంతోనే పవన్ ఇలా ఒక "ఆధ్యాత్మిక-రాజకీయ పటిష్టత" ప్రదర్శించారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. "ఏథెన్స్ కంటే ప్రాచీనమైన మధురైలో మాట్లాడే అవకాశం రావడం" అనే వ్యాఖ్యతో ఆయన తన భావోద్వేగాన్ని ప్రజలతో పంచుకున్నారు. దాని వెనుక రాజకీయ ప్రయోజనాల కోసం తమిళ హిందువుల మన్ననలు పొందాలన్న తపన స్పష్టంగా కనిపిస్తుంది.
దక్షిణాదిన పార్టీ విస్తరణ
ఈ సభ పవన్ కళ్యాణ్‌కు ద్వంద్వ ప్రయోజనం కలిగించిందనే చెప్పాలి.జనసేన ఇప్పటివరకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు పరిమితమైన పార్టీగా ఉన్నా, పవన్ చేసిన ఈ విధమైన ప్రసంగం ద్వారా సుదీర్ఘంగా దక్షిణ భారతంలో పార్టీని విస్తరించాలనే సంకల్పాన్ని చూపించారని విశ్లేషకుల అభిప్రాయం. హిందుత్వంపై పట్టుసాధించాలన్న బీజేపీ ధోరణిని అనుసరించడమే కాక, దానికి తోడు పవన్ తన స్వంత మార్క్‌ను కూడా వేసే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్‌కు రాజకీయంగా మూడు దిశలలో ఉపయోగపడే అవకాశముంది. హిందూ మత పరిరక్షణ కంటే ముందుకెళ్లి – హిందుత్వ భావనలో పునాదులు వేసే ప్రయత్నం కావచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com