PAWAN: బహు భాషలే భారత్‌కు మంచిది: పవన్

బహు భాషలే భారతదేశానికి మంచిదని జనసేన అధినేత పవన్ అన్నారు. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే సిద్ధాంతం ఉండాలని స్పష్టం చేశారు. . జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురం చిత్రాడలో నిర్వహించిన ‘జయకేతనం’ సభలో ఆయన ప్రసంగించారు. జనసేన సభకు వచ్చి సినిమాల గురించి మాట్లాడవద్దని పవన్ సూచించారు. ఇక్కడున్న జనసైనికులంతా ప్రాణాలకు తెగించి వచ్చారని... 450 మంది జనసైనికులు సినిమాలను కాదని... సిద్ధాంతాలను నమ్మి చనిపోయారని అన్నారు. వారి గౌరవం కోసం ఇక్కడ సినిమాల గురించి మాట్లాడవద్దని చెబుతున్నామన్నారు.
పవన్ సింహ గర్జన.. మార్మోగిన సభ
పిఠాపురం సభ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సింహ గర్జన చేశారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొని జనసేను అధికారంలోకి తెచ్చామని అన్నారు. పవన్ సభా వేదికపైన జై జనసేన.. జై జనసేన అంటూ పవన్ గర్జించారు. ఈ నినాదాలకు జనసేన శ్రేణులు మాట కలిపాయి. దీంతో జనసేన సభ జరుగుతున్న ప్రాంగణం మార్మోగిపోయింది. అసెంబ్లీ గేటు కూడా తాకలేవన్న వారి... తొడలను విరగొట్టి మరీ సభలోకి వెళ్లామన్నారు.
హిందీని తమిళనాడు వ్యతిరేకించడంపై ఆగ్రహం
జనసేన 12వ ఆవిర్భావ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హిందీని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించడంపై మండిపడ్డారు. ‘అలా అయితే తమిళ్ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. నార్త్ సినిమాల నుంచి డబ్బులు కావాలి గానీ భాషలు వద్దా? భాషలపై వివక్ష ఎందుకు? సంస్కృతం, హిందీ మన భాషలే కదా? పనిచేసేవాళ్లు బిహార్ నుంచి రావాలి కానీ హిందీ మాత్రం వద్దా? . ’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
దేశం కోసం చనిపోవడానికైనా సిద్ధమే
మతానికో న్యాయం అంటే కుదరదు.. అందరికీ ధర్మం ఒక్కటేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ‘ఇతర మతాలను గౌరవించాలని సనాతన ధర్మం మాకు నేర్పింది. సెక్యులరిజం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. తప్పు ఎవరు చేసినా తప్పని గట్టిగా చెప్పండి.. మతాల ప్రస్తావన వద్దు. ఇప్పుడు మనం వేసింది తొలి అడుగు మాత్రమే. భారతదేశం కోసం చనిపోవడానికైనా సంసిద్ధంగా ఉన్నా. నా ఇంటెన్సిటీ చాలా వైల్డ్‌గా ఉంటుంది.' అని పవన్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com