PAWAN: జనసేన నేతలపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం

PAWAN: జనసేన నేతలపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం
X
అన్నీ నేనే మాట్లాడితే మీరేందెకంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు సూటి ప్రశ్న

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంగళగిరిలో నిర్వహించిన జనసేన పార్టీ కార్యవర్గం, సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడిన తీరు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీని ఎంతో కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత, కొందరు నేతల నిర్లక్ష్య ధోరణి, బాధ్యతారాహిత్యం తనను తీవ్రంగా ఆలోచనలో పడేస్తోందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇటీవల రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని జనసేన నేతలు సమర్థంగా ఎదుర్కోలేకపోవడంపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పటికీ, పార్టీ తరఫున సరైన స్థాయిలో స్పందన కనిపించకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతి అంశంలో తానే ముందుకు వచ్చి మాట్లాడాల్సి వస్తే, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నేతలు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.

వైసీపీ నేతలు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తూ పార్టీ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అలాంటి రాజకీయ ఉచ్చుల్లో జనసేన నేతలు చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వ్యక్తిగత విమర్శలకు దిగకుండా, సిద్ధాంతపరంగా, విషయపరంగా మాత్రమే ప్రతిస్పందించాలని సూచించారు. విమర్శలకు భావోద్వేగాలతో కాకుండా, వాస్తవాలతో సమాధానం చెప్పాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకంగా మహిళల విషయంలో పార్టీ శ్రేణులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని పవన్ కల్యాణ్ సూచించారు. చిన్న విషయాన్నే పెద్ద ఆరోపణగా మార్చి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మాటలు, చర్యలు చాలా సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రత్యర్థులు చేసే తప్పుడు ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి నేత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

పార్టీ లోపల క్రమశిక్షణ అత్యంత కీలకమని పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు. ఎవరు ఎంత పని చేస్తున్నారు? ఎవరు బాధ్యతలు నిర్వర్తించడం లేదో అన్న పూర్తి సమాచారం తన వద్ద ఉందని వెల్లడించారు. ప్రతి నేత పనితీరుపై తాను నిరంతరం నిఘా పెట్టి ఉన్నానని, ఎవరి పాత్ర ఏంటన్నది తనకు స్పష్టంగా తెలుసని అన్నారు. ఇకపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరిక జారీ చేశారు.

Tags

Next Story