PAWAN: దేశం.. ఏపీ వైపు చూస్తోంది: పవన్ కల్యాణ్

రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ విజయవంతం కావడానికి చంద్రబాబు అనుభవమే కారణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఫారం పాండ్‌లను ప్రారంభించిన పవన్ కల్యాణ్.. అనంతరం బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఓర్వకల్లు మండలం పూడిచర్లలో పంట కుంట నిర్మాణ పనులకు పవన్ భూమి పూజ చేశారు. రాష్ట్రం బాగుండాలని చంద్రబాబు ఎప్పుడూ పరితపిస్తుంటారని అన్నారు. దేశం ఇప్పుడు ఏపీ వైపు చూస్తోందన్న డిప్యూటీ సీఎం.. అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతామని ప్రకటించారు. రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని పవన్ వెల్లడించారు. గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను పట్టించుకున్న పాపాన పోలేదన్న ఆయన... గ్రామ పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రాజకీయ ఉపాధిగా మార్చేశారని మండిపడ్డారు. నీటి నిల్వ అనేది.. భవిష్యత్తుకు బంగారు బాటగా అభివర్ణించారు.
వ్యవస్థలను పటిష్టం చేస్తున్నాం:
చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. అనుభవజ్ఞుల నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నానని అన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పంట కుంటల నిర్మాణం చేపడుతున్నామని పవన్ వెల్లడించారు.
పవన్ దత్తత తీసుకున్న గ్రామం ఇదే
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం రూ.50 లక్షలు ప్రకటించారు. పూడిచర్లలో ఫాం పాండ్స్ కు శంకుస్థాపన చేసిన ఆయన.. కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, పవన్ ఇంటి పేరుకు, కొణిదెల గ్రామానికి ఎలాంటి సంబంధం లేదు.
ఫ్యాన్స్‌తో ఆసక్తికర సంభాషణ
కర్నూలు జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్... అభిమానులతో ఆసక్తికర సంభాషణ జరిపారు. ఆయన ప్రసంగిస్తుండగా ఓజీ ఓజీ అంటూ అభిమానులు కేరింతలు కొట్టారు. అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ పల్లెలు, రోడ్లు, దేశం బాగుండాలనేదే నా ఆలోచన అని మీరు ఓజీ ఓజీ అంటున్నారని అభిమానుల శక్తి ముందు నా శక్తి కూడా సరిపోదు అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com