AP: ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదిస్తున్నాం: పవన్

ఎస్సీ వర్గీకరణ బిల్లును మనస్ఫూర్తిగా ఆమోదిస్తున్నామని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ-మిశ్రా నివేదికపై చర్చ జరిగింది. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో జరిగిన చర్చలో పవన్ మాట్లాడారు. మందకృష్ణ, చంద్రబాబు వల్లే వర్గీకరణ ఇంత దూరం వచ్చిందని తెలిపారు. మాదిగల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత మందకృష్ణదేనని పవన్‌కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అందరికీ సమాన అవకాశాలు లభించడం కోసం ఎస్సీ వర్గీకరణకు జనసేన సంపూర్ణ మద్దతునిస్తోందని పవన్ అన్నారు. వర్గీకరణ పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ అయితే, వర్గీకరణ రూపకర్త చంద్రబాబు అని, వర్గీకరణ ఫలప్రదాత ప్రధాని మోదీ అని వ్యాఖ్యానించారు. వర్గీకరణ అంశం ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అయితే, దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు.
ఏపీలో మాలలు ఎక్కువ
తెలంగాణాలో మాదిగలు ఎక్కువ, ఏపీలో మాలలు ఎక్కువని పవన్ కల్యాణ్ అన్నారు. వివిధ రాష్ట్రాల్లో వివిధ ఉపకులాలు ఎక్కువ తక్కువలు ఉన్నాయన్నారు. 100 నుంచి 10,000ల మంది లోపు ఉన్న 46 ఉపకులాలు ఉన్నట్టు రాజీవ్ రంజన్ మిశ్రా చెప్పారన్నారు. సీఎం వర్గీకరణ అంశంపై నాలుగు నెలల్లో ఏకసభ్య కమిషన్ వేయడంతో పాటు మంత్రుల కమిటీని వేశారని తెలిపారు. ఎస్సీల ఆర్థిక రాజకీయ సామాజిక వెనుకబాటుపై ఈ కమిషన్ బాగా అధ్యయనం చేసిందని అన్నారు. మందకృష్ణ ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఆద్యుడని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బేడ,బుడగ జంగాలు, రెల్లి కులాలకు కూడా ఏదో విధంగా న్యాయం చేయాలని పవన్ సూచించారు.
చాలా చర్చలు జరిగాయి
ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయని పవన్ గుర్తు చేశారు. గుర్తింపు లేని కులాలపైనా విస్తృతంగా చర్చలు జరిగాయన్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారని... కమిషన్ ఇచ్చిన నివేదిక చాలా అద్భుతంగా ఉందని పవన్ ప్రశంసలు కురిపించారు. ఇది అందరికీ మేలు చేస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. మాదిగ అని చెప్పగలిగే గుండె ధైర్యం కలిగిన వ్యక్తి మందకృష్ణ. ఆ కులానికి వన్నె తెచ్చిన ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై మేధావులతో చర్చలు జరిపామన్నారు. మాల మాదిగ ఐక్యత గురించి కూడా చాలా మంది మాట్లాడారని చెప్పారు. ఈ రెండు కులాలతో పాటు ఉపవర్గాలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై విస్తృతంగా చర్చలు జరిగాయని పవన్ వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com