Pawan Kalyan Meet Amit Shah : కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసిన పవన్ కళ్యాణ్ !
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఇటీవల విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు కేంద్రం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను పవన్ వ్యతిరేకించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిర్ణయాన్ని విరమించుకునేలా కేంద్ర పెద్దలతో మాట్లాడుతానని పవన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడం.. కేంద్ర హోంమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ అమిత్ షాకు పవన్ లేఖ ఇచ్చారు. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు. 32 మంది ప్రాణ త్యాగ ఫలితంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటైందని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అని పేర్కొన్నారు.
పరిశ్రమను ప్రైవేటుపరం చేయొద్దని కోరారు. సుమారు 18వేల మంది శాశ్వత ఉద్యోగులు, 20వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారన్నారు. మరో లక్ష మంది ప్రజలు ఉక్కు కర్మాగారం మీద పరోక్షంగా ఆధారపడ్డారని లేఖలో పేర్కొన్నారు. బీజేపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత మొదటిసారి అమిత్ షాతో పవన్ భేటీ అయ్యారు. త్వరలో తిరుపతి ఉప ఎన్నిక జరగనున్న నేపధ్యంలో ఈ విషయంపై కూడా ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com