ఆరోగ్యసమస్యలతో మధ్యంతర బెయిల్‌పై బయటకొచ్చిన చంద్రబాబును హైదరాబాద్‌లో ఆయన నివాసానికి వెళ్లిన పవన్, నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. చంద్రబాబు ఆరోగ్యంపై వారు ఆరా తీశారు. ఆ తర్వాత ఎన్నికల మేనిఫెస్టో ఇరువురు చర్చించినట్లు తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి. దాదాపు రెండున్నర గంటల సమావేశంలో షణ్ముఖ వ్యూహం పేరిట జనసేన తరపున ఆరు అంశాలను పవన్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరిట వివిధ రంగాలకు ఆర్ధిక ప్రోత్సాహం ఇస్తూ పారిశ్రామికంగా ఉద్యోగాల కల్పన దిశగా ప్రణాళిక రూపకల్పనకు సూచించినట్లు తెలిసింది. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ విశాఖ, తిరుపతి, విజయవాడలను క్లస్టర్ల వారీగా మహా నగరాలుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
బీపీఎల్ కుటుంబాలు ఇళ్లు కట్టుకోవాలన్నా లేక ఇళ్ల మరమ్మతులు చేసుకోవాలన్నా ఉచితంగా ఇసుక పంపిణీ చేయటం సహా 30లక్షల భవన నిర్మాణ కార్మికులకు చేయూతనిచ్చే ప్రత్యేక కార్యాచరణపై చర్చించిన్నట్లు సమాచారం. సౌభాగ్య పథకం పేరిట ఏటా లక్ష మంది యువ పారిశ్రామిక వేత్తలకు చిరు వ్యాపారాలు, సూక్ష్మ,చిన్న తరహా పరిశ్రమలు నడుపుకునేలా 10లక్షల చొప్పున సాయం అందించాలని తద్వారా కొత్త ఉద్యోగాల కల్పన జరిగేలా చూడాలని పవన్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వ్యవసాయం - బంగారు ఫలసాయం పేరిట ఉద్యాన రైతులకు 5వేల కోట్ల రూపాయలతో.. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయటంతోపాటు ఆ పంటలు పండే ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సూచించినట్లు
సమాచారం. మైనర్ ఇరిగేషన్ రంగాన్ని ప్రోత్సహించి వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడలని ప్రతిపాదించారు.మన ఏపీ మన ఉద్యోగాలు పేరిట.. ఏటా ఏపీపీఎస్సీ ద్వారా సకాలంలో పోస్టుల భర్తీ చేయటం ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలను పవన్ ప్రతిపాదించారు. సీపీఎస్ రద్దు చేసి పాత ఫించన్ విధానం అమలు హామీని మేనిఫెస్టోలో చేర్చాలని సూచించినట్లు తెలుస్తోంది. పవన్ చేసిన ప్రతిపాదనలకు సానుకులంగా స్పందించిన చంద్రబాబు..త్వరలోనే మరోసారి సమావేశమై ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలని నిర్ణయించిన్నట్లు సమాచారం. దాదాపు 2గంటల పాటు వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అక్టోబరు 31న రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన చంద్రబాబు వైద్య పరీక్షల కోసం ఇటీవల హైదరాబాద్ వచ్చారు. శుక్రవారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్యులు అన్ని రకాల రక్త పరీక్షలతో పాటు గుండె, ఊపిరితిత్తులు, చర్మ అలర్జీకి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. రెండ్రోజుల్లో చంద్రబాబు ఎల్వీపీఈఐలో నేత్ర పరీక్షలతో పాటు సర్జరీ చేయించుకుంటారని సమాచారం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com