Pawan Kalyan: నవరత్నాల అమలులో ఎన్నో మోసాలున్నాయి : జనసేనాని

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జగన్ సర్కార్ నవరత్నాలు పథకాల అమలుపై సందేహాలు లేవనెత్తారు. నవ సందేహాల పేరుతో జనసేనాని ప్రశ్నలు సంధించారు. రైతు భరోసాతో 64 లక్షల మందికి మేలని చెప్పి..50 లక్షల మందికే భరోసా ఇవ్వటం నిజం కాదా అని పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. వైసీపీ మూడేళ్ల పాలనలో మూడు వేలమంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. కేవలం ఏడు వందల మందికే ఆర్థిక సాయం అందించి చేతులు దులుపుకున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
అటు రెండోరత్నంగా చెబుతున్న అమ్మఒడిని 43 లక్షల మందికే అందించి.. 83 లక్షల మందికి ఇచ్చామని గొప్పలతో అబద్ద ప్రచారంపై పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఫించన్ల జాబితాను కుదించి 5 లక్షల మందిని తొలగించటంపై జగన్ సర్కార్ ఏం సమాధానం చెబుతుందని జనసేనాని ప్రశ్నించారు.
మరోవైపు సంపూర్ణ మద్యనిషేధం అంటూ ఎన్నికల వేళ చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించిన పవన్ కల్యాణ్...గత ఏడాది మద్యంపై 22వేల కోట్ల ఆదాయం చూపి.. 8వేల కోట్ల బాండ్లు అమ్మటంపై సమాధానం చెప్పాలన్నారు. జలయజ్ఞం మంటూ చేపట్టిన పోవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో సీఎం జగన్‌నే స్పష్టం చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
అటు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నుంచి ఆస్పత్రులు ఎందుకు పక్కకు తప్పుకుంటున్నాయో చెప్పాలన్న జనసేనాని.. CMRF నుంచి వైద్యం ఖర్చులు ఎందుకు చెల్లించటం లేదని ప్రశ్నించారు. ప్రతి విద్యార్థి లోటులేని చదువుంటూ గొప్పలు చెప్పిన సీఎం జగన్.. కళాశాలలకు చెల్లించాల్సిన రీ యింబర్స్ మెంట్‌పై ఏం సమాధానం చెబుతారన్నారు. రీ యింబర్స్‌మెంట్‌తోనే.. విద్యార్థులకు హాల్‌టికెట్స్ ఆపేస్తున్నది నిజం కాదాని పవన్ ప్రశ్నించారు.
మరోవైపు పేదోళ్లకు చెరువుల్లో, గుట్టల వెంబడి ఇచ్చిన ఇళ్ల స్థలాలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించిన జనసేనాని..ఇళ్ల పథకానికి నిధులు ఎందుకు ఇవ్వటంలేదో స్పష్టం చేయాలన‌్నారు. మరోవైపు ఆసరా పథకం కింద పొదుపు సంఘాలను ఏటేటా ఎందుకు తగ్గిస్తున్నారో చెప్పాలన్న పవన్...రెండు వేల కోట్ల అభయ హస్తం నిధుల మాటేంటని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com