నన్ను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌ను దింపారు: పవన్‌కళ్యాణ్

జనసేనాని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని.. ప్రత్యేకంగా సుపారీ గ్యాంగులను దింపారనే సమాచారం ఉందన్నారు. జనసేన నాయకులతో పాటు జనసైనికులు, వీర మహిళలు కచ్చితంగా భద్రతా నియమాలను పాటించాలన్నారు. కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొన్న పవన్.. ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలకు జనసేన పార్టీ బలంగా ఉందని.. వైసీపీ పాలకులను గద్దె దింపే దిశగా పయనిస్తోందన్నారు. ఇలాంటి సమయంలో వారు ఏం చేయడానికైనా సిద్ధపడతారన్నారు.
అధికారం పోతుందన్న భావన నాయకులను క్రూరంగా మార్చేస్తుందన్నారు పవన్. తనను భయపెట్టేకొద్దీ మరింత రాటుదేలుతానని హెచ్చరించారు. గతంలో కాకినాడ ఎమ్మెల్యే అనుచరులు జనసైనికులు, వీరమహిళల మీద చేసిన దాడిని మర్చిపోనన్నారు. ఓ బలమైన కార్యాచరణ లేక అప్పట్లో వెనుకడుగు వేశామని.. సరైన సమాధానం చెప్పే రోజు కచ్చితంగా వస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి ఒక్కటీ దక్కకూడదని స్పష్టం చేశారు. తాను సినీ నటుడిని కాకపోయి ఉంటే.. బలమైన నాయకుడిగా జనంలోకి చొచ్చుకుని వెళ్లేవాడిననన్నారు. అభిమానుల తాకిడి తనను అడ్డుకుంటోందని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com