PAWAN: పవన్ కల్యాణ్ పెద్ద మనసు.. ఉన్నత విద్యకు చేయూత

PAWAN: పవన్ కల్యాణ్ పెద్ద మనసు.. ఉన్నత విద్యకు చేయూత
X
10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య

పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా, విద్యా రంగంలోనూ ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముందడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా పేద మరియు అనాథ విద్యార్థుల భవిష్యత్తుపై ఆయన చూపిస్తున్న శ్రద్ధ స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే తల్లిదండ్రులు లేని చిన్నారులకు ప్రతి నెలా తన వ్యక్తిగత జీతం నుంచి రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్న పవన్ కల్యాణ్‌, ఇప్పుడు పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థుల ఉన్నత చదువులకు భరోసాగా నిలిచారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఈసారి పదో తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబర్చిన విద్యార్థులను గుర్తించిన ఆయన, వారి భవిష్యత్తు చదువుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. తన సహాయం పొందుతున్న విద్యార్థుల్లో ఏడుగురు అత్యుత్తమ మార్కులు సాధించగా, నియోజకవర్గం మొత్తం మీద 580కి పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 31కి చేరింది. వీరిలో ఒక విద్యార్థి 598 మార్కులతో రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలవడం విశేషం.

ఈ ప్రతిభావంతులైన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్‌ వారందరికీ ఉచితంగా ఉన్నత విద్య అందించేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో స్వయంగా మాట్లాడి, వారి ఆసక్తులు మరియు భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా కోర్సులు, కళాశాలలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. అనంతరం ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చించి, 31 మంది విద్యార్థులకు పూర్తిస్థాయి ఉచిత ప్రవేశాలు కల్పించేలా సహకారం అందించారు. తన విజ్ఞప్తికి వెంటనే స్పందించి పిఠాపురం విద్యార్థులకు అవకాశాలు కల్పించిన విద్యాసంస్థలకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

కాన్వాయ్ తగ్గించిన పవన్

ఇంధన వాడకాన్ని తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుతో పవన్ చర్యలకు ఉపక్రమించారు. తన కాన్వాయ్ లోని వాహనాలను 50% తగ్గించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల‌ పర్యటనల్లోనూ వాహనాల సంఖ్యను సగానికి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. పొదుపు చర్యలు సూచించిన మోడీ స్వయంగా పాటిస్తున్నారని.. ఆ స్ఫూర్తి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ కొనసాగించాలని స్పష్టం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Tags

Next Story