PAWAN: కాసేపట్లో కొండగట్టుకు పవన్ కల్యాణ్

PAWAN: కాసేపట్లో కొండగట్టుకు పవన్ కల్యాణ్
X
భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో వెలసిన ఆంజనేయ స్వామిని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శనివారం దర్శించుకోనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ కార్యాలయం అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కొండగట్టు ఆలయ ప్రాంగణంలో టీటీడీ నిధులతో చేపట్టనున్న కీలక అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని పవన్ కల్యాణ్ తన ఇలవేల్పుగా భావిస్తారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం ఆయన కొండగట్టు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనతో మాట్లాడుతూ ఒక కీలక అంశాన్ని ప్రస్తావించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు దీక్షలతో కొండగట్టు చేరుకుంటున్నారని, అయితే వారికి తగిన వసతులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. దీక్ష విరమణకు ప్రత్యేక మండపం, విశ్రాంతి గదులు, వసతి సౌకర్యాలతో కూడిన సత్రం నిర్మాణం అత్యవసరమని ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

ఈ విజ్ఞప్తికి స్పందించిన పవన్ కల్యాణ్, ఆలయ అభివృద్ధికి సహకరించాలని నిర్ణయించారు. టీటీడీ సహాయంతో కొండగట్టు క్షేత్రంలో అవసరమైన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుంచగా, ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) చైర్మన్‌తో చర్చలు జరిపారు. భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ వెంటనే రూ.35.19 కోట్ల నిధుల మంజూరుకు అంగీకరించింది. ఈ అభివృద్ధి పనులకు శనివారం ఉదయం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆయన జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు. ఇటీవల జరిగిన తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతుతో విజయం సాధించిన ప్రజాప్రతినిధులను కలుసుకుని అభినందనలు తెలియజేస్తారు. అలాగే భవిష్యత్ కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags

Next Story