PAWAN: ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ సమీక్ష

జనసేన పార్టీ కార్యవర్గ సమావేశం విశాఖపట్నంలో నిర్వహించారు. 'సేనతో సేనాని'తో మూడు రోజుల పాటు జనసేన పార్టీ క్యాడర్ తో పవన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక చర్చలు జరిపారు. అయ్యారు. కూటమి స్ఫూర్తిని పరిపాలనలో ఎలా కొనసాగించాలి, ప్రజా సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించడంతో పాటు చట్టసభల్లో చర్చించాల్సిన అంశాలపై సూచనలు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కార్యవర్గ కమిటీతో పవన్ సమావేశం జరిగింది, ఇందులో పార్టీని మరింత ప్రజాదరణ పొందేలా చేయడం , ప్రభుత్వంతో సమన్వయం గురించి చర్చించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. పవన్ కళ్యాణ్ మూడు రోజులు విశాఖలోనే ఉంటారు. కార్యకర్తలు, ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. జనసేన పార్టీ కార్యకర్తలతో, ప్రజలతో మరింత దగ్గరగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో కూటమి నేతలు, ఎమ్మెల్యేలపై ఇటీవల పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై జనసేన అధిష్టానం ఫోకస్ పెట్టింది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పని తీరుపై సర్వే చేయించింది. ఈ రిపోర్టును తన వద్దకు తెప్పించుకుంది. దీంతో జనసేన ఎమ్మెల్యేతో నియోజకవర్గాల వారీగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ప్రతి ఎమ్మెల్యేతో 5 నుంచి 10 నిమిషాలు సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలపై ఈ భేటీలో వివరణ కోరారు. ఎమ్మెల్యేల పని తీరుపై సర్వే చేయించిన పవన్ కల్యాణ్.. ఆ రిపోర్ట్స్ ఆధారంగా ర్యాంక్‌లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
నేడు కీలక చర్చలు
'సేనతో సేనాని’ సభకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా నామకరణం చేశారు. ఐదు ప్రధాన ద్వారాలకు ఉత్తరాంధ్ర మహనీయుల పేర్లు పెట్టారు. జనసేన పార్టీ ఎల్లప్పుడు జాతీయ నాయకులను, మహనీయులను స్మరించుకుంటుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. జనసేన పార్టీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చిస్తారు. నేడు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10 మంది పార్టీ సభ్యులను ఎంపిక చేస్తారు. వారితో పవన్ కళ్యాణ్ వివిధ అంశాలపై మాట్లాడతారు. ఆ రోజు రాత్రి ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 30వ తేదీన ఇందిరా గాంధీ ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు అధికంగా ప్రభుత్వ పనుల్లో నిమగ్నమైన పవన్ , తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలతో నేరుగా మాట్లాడటం ప్రత్యేకతగా మారింది. గత సంవత్సరం నుండి కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు నేరుగా చెప్పే అవకాశం లభించడం వల్ల ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
పెరగనున్న జనసేన బలం
సేనతో సేనాని సమావేశాలతో జనసేనకి రెట్టింపు బలం పెరుగుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోవడానికి విస్తృతస్థాయి సమావేశాలు ఉపయోగపడతాయన్నారు. ఉత్తరాంధ్రపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అమితమైన ప్రేమ ఉందని.. కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకొని వ్యూహం రూపొందించడం పవన్ కళ్యాణ్ ప్రత్యేకత అన్నారు. రాష్ట్ర క్షేమం కోసం సుస్థిర పాలన ఉండాలని కోరుకున్న నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ అని అన్నారు. టీడీపీ ప్రతి రెండేళ్లకోసారి “మహానాడు” పేరిట విస్తృత సమావేశాలు చేస్తూ వస్తోంది. వైసీపీ కూడా అప్పుడప్పుడు “ప్లీనరీ” పేరుతో భారీ సదస్సులు నిర్వహిస్తుంది. కానీ జనసేన మాత్రం ఇప్పటి వరకు వార్షికోత్సవం తప్ప మరే పేరుతో పెద్ద సమావేశాలు చేయలేదు. తొలిసారి “సేనతో సేనాని” పేరిట మూడు రోజులపాటు నిర్వహించడం పార్టీ భవిష్యత్తులో మరింత సుస్థిరమైన సంప్రదాయంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. 30వతేదీ నిర్వహించే బహిరంగ సభలో సాయంత్రం 6 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం పార్టీ భవిష్యత్తు దిశను నిర్ణయించే స్థాయిలో ఉండబోతోందని శ్రేణులు అంటున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com