PAWAN; తెలంగాణ ప్రజలకు కొత్త నాయకత్వం కావాలి

తెలంగాణ ప్రజలకు కొత్త నాయకత్వం అవసరమని, ఆ మార్పు గ్రామ స్థాయి నుంచే ప్రారంభం కావాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పంచాయతీల నుంచే అభివృద్ధి ప్రస్థానం మొదలవుతుందని పేర్కొన్న ఆయన, సర్పంచులు, వార్డు మెంబర్లుగా గెలుపొందడం ఎంతో కీలకమైన తొలి అడుగుగా అభివర్ణించారు. ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందని, ఈ రోజు వేసిన అడుగు తెలంగాణలో సరికొత్త మార్పుకు నాంది కావాలని ఆకాంక్షించారు. శనివారం కొండగట్టు పర్యటనలో భాగంగా, ఇటీవల తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున సర్పంచులు, వార్డు మెంబర్లుగా విజయం సాధించిన అభ్యర్థులు, అలాగే పోటీ చేసిన అభ్యర్థులతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. పార్టీ మద్దతుతో పోటీ చేసి సుమారు 50 శాతం విజయాలు సాధించడం అభినందనీయమని పేర్కొంటూ, గెలుపొందిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి బలమైన పునాది అవుతుందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్, తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున సాధించిన విజయాన్ని చారిత్రకంగా అభివర్ణించారు. మీరు మొదలుపెట్టిన ప్రయాణం ఎంతో కీలకమైనదని, దీనిని బాధ్యతతో కొనసాగించాలని సూచించారు. తాను పార్టీ స్థాపించడానికి చైతన్యం, ధైర్యం ఇచ్చింది తెలంగాణ నేలేనని తెలిపారు. తెలంగాణ పోరాట స్ఫూర్తి అంటే తనకు ఎంతో అభిమానమని, ఇక్కడి ప్రజల నుంచి ఏమీ ఆశించడం లేదని స్పష్టం చేశారు. దేశం కోసం, తెలుగు నేల కోసం జనసేన పార్టీ తరఫున చేయగలిగిన సేవను కలసికట్టుగా చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేనేనని గుర్తు చేస్తూ, ఇక్కడి ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలుగు ప్రజల ఐక్యత కోసం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ నొక్కి చెప్పారు. తెలంగాణకు బలమైన యువ నాయకత్వం అవసరమని, ప్రతి ఒక్కరూ తమ స్థాయి, తమ ప్రాంతాన్ని బట్టి పోరాటం చేయాలని సూచించారు. సైద్ధాంతిక బలంతో సహజంగా ఎదగాలని, ఒక సిద్ధాంతం ఆధారంగా ఎదిగిన నాయకత్వాన్ని విభేదించడం కష్టమని తెలిపారు. ఆ సిద్ధాంత రాజకీయాలను తాను ఆచరణలో చేసి చూపానని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు విభిన్నంగా ఉన్నప్పటికీ, తెలంగాణ నేల తనకు పోరాట శక్తిని ఇచ్చిందని పవన్ కల్యాణ్ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో 53 మంది అభ్యర్థులు విజయం సాధించారని, దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో జనసేనకు దక్కిన ఈ విజయం ప్రత్యేకమని పేర్కొన్నారు. అందరికీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ, ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలూ క్షేమంగా ఉండాలని, తెలుగు ప్రజల ఐక్యత కోసం కలసి పనిచేద్దామని పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ముగించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

