18 Nov 2020 3:20 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఆనాడు కులం, పార్టీ...

ఆనాడు కులం, పార్టీ లేని జగన్‌కు ఇప్పుడు అవే కనిపిస్తున్నాయా? : పవన్ కళ్యాణ్

ఆనాడు కులం, పార్టీ లేని జగన్‌కు ఇప్పుడు అవే కనిపిస్తున్నాయా? : పవన్ కళ్యాణ్
X

రాజధాని రైతుల్ని ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. అమరావతి రైతులు, మహిళలు పవన్‌ను కలిశారు. భూములు ఇచ్చి మానసిక క్షోభ అనుభవిస్తున్నామని మహిళలు కన్నీరు పెట్టారు. ఎప్పుడూ బయటకు రాని మహిళలు రోడ్లపైకి వచ్చారని.. లాఠీఛార్జ్‌లు, నిర్బంధాలను భరిస్తూ ఉద్యమం చేస్తున్నారన్నారు పవన్‌. దళితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టే స్థాయికి‌ వైసీపీ ప్రభుత్వం దిగజారిందని మండిపడ్డారు. ఎంతోమంది మహిళలు తమ పుట్టింటి కానుకగా భూములు తెచ్చుకుని ఉంటారని.. అటువంటి పొలాలను కూడా రాజధాని‌ కోసం త్యాగం చేశారని గుర్తు చేశారు. 2014లో జగన్ అమరావతికి అంగీకారం తెలిపారని... అప్పుడు వ్యతిరేకంగా ఉంటే..‌ రైతులు భూములు ఇచ్చే వారు కాదన్నారు. తాను రైతు పక్షపాతినని.. రైతుల కష్టం, భూమి విలువ తనకు తెలుసన్నారు. 29 వేల మంది రైతులు భూములు ఇస్తే.. ఇప్పుడు కులాలు, రాజకీయాలు అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు కులం, పార్టీ లేని జగన్‌కు ఇప్పుడు అవే కనిపిస్తున్నాయా?' అని ప్రశ్నించారు.

అమరావతి ఉద్యమాన్ని మహిళలే ముందుండి నడిపిస్తున్నారన్నారని.. ఈ ఉద్యమానికి జనసేన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పవన్‌ భరోసా ఇచ్చారు. ఓట్లు వేయకపోయినా.. తాను ధర్మం వైపు నిలుస్తానని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి అని అందరూ చెప్పారని... రాజధాని ఇక్కడే ఉంటుందని తాను బలంగా నమ్ముతున్నట్లు చెప్పారు. పోలీసులు పొలిటికల్ బాస్‌లు చెప్పినట్లు చేయడం కాకుండా కాస్త ఆలోచించాలన్నారు. ప్రజలు రోడ్లపైకి వస్తే ఏం జరుగుతుందో గుర్తించాలన్నారు. దళితులపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసులు పూర్తిగా ఉపసంహరించుకోవాలన్నారు. బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్న సమయంలోనే అమరావతి రాజధానిగా నిర్ణయించామని... బీజేపీ నేతల వ్యాఖ్యలు గందరగోళంగా ఉన్నా.. అమరావతి అంశంలో‌ వారు కూడా క్లారిటీగా ఉన్నారన్నారు పవన్‌. వ్యవస్థలలో ఉన్న ఇబ్బందుల వల్ల.. కేంద్రం అన్ని అంశాలలో జోక్యం చేసుకోదన్నారు.

పాలకులు పరిస్థితులకు తగ్గట్టు మాట మార్చేస్తూ ఉంటారని, అమరావతి విషయంలో అదే జరిగిందని పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో క్రియాశీల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. విభజించి పాలించే విధానంతో పాలకులు వెళ్తున్నారని, అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనేది జనసేన అభిప్రాయమని పవన్ స్పష్టం చేశారు.

Next Story