PAWAN: అధికారులకు పవన్ స్పష్టమైన ఆదేశాలు

రహదారుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. రెండు నెలల కిందట పెనమలూరు పరిధిలో పల్లెపండగ కార్యక్రమాన్ని నిర్వహించిన సమయంలో పవన్ పలు రహదారుల నిర్మాణానికి వేదిక పైనుంచి హామీ ఇచ్చారు. వెంటనే నిధులను విడుదల చేయించి ఆ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ రహదారి పనుల నాణ్యతను పరిశీలించేందుకు పవన్ కల్యాణ్ పెనమలూరు వచ్చారు. ప్రస్తుతం ఆ రహదారి పనులు జరుగుతుండడంతో నాణ్యత తనిఖీకి పవన్ వచ్చారు. పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారి నిర్మాణంలో నాణ్యత ఎలా ఉందో తెలుసుకునేందుకు.. కొత్త రోడ్డుపై మధ్యలో గుంత తవ్వించి మరీ లేయర్లను పరిశీలించారు. టేపు పెట్టి ఆయనే లేయర్లను కొలిచారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని కలెక్టర్ డి.కె.బాలాజీ, ఇతర అధికారులకు సూచించారు. అనంతరం కంకిపాడులోని సీసీ రహదారులను కూడా తనిఖీ చేశారు. సీసీ రహదారులు ఎంత మందంగా వేశారు, నాణ్యత ప్రమాణాలు పాటించారా అనే అంశాలను కాలువల దగ్గర కూర్చుని మరీ పరిశీలించారు.
తాగునీటి పథకాలను పరిశీలించిన పవన్
గుడివాడలో మంచినీటి పథకాల పరిశీలన.. గుడివాడ నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల తాగునీటి పథకాల అమలు తీరును పవన్ పరిశీలించారు. మల్లాయపాలెంలో రక్షిత మంచినీటి పథకాల ద్వారా సరఫరా అయ్యే నీటిని శుద్ధి చేసే విధానాన్ని తనిఖీ చేశారు. నీటి నాణ్యత పరీక్షలు చేయించి మరీ పరిశీలించారు. 43 గ్రామాల్లో తాగునీటి పథకాల మరమ్మతుల వివరాలను తెలుసుకున్నారు.
గొప్ప దేశభక్తులలో వాజ్‌పేయి ఒకరు: పవన్
ఈనెల 25న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. 'మాతృభూమి స్వేచ్ఛ కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు అటల్ జీ. అసాధారణ మాటతీరుతో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే సామర్ధ్యం గల గొప్ప రాజనీతిజ్ఞుడు. గొప్ప దేశ భక్తుల్లో వాజ్‌పేయి ఒకరు. ఆయన పదాలు, పద్యాలు లక్షలాది మంది హృదయాలను తాకాయి.' అంటూ పవన్ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com