ప్రకాశం జిల్లాలో బరితెగించిన వైసీపీ నేత.. రైతు భూమి కబ్జా..

ప్రకాశం జిల్లాలో బరితెగించిన వైసీపీ నేత.. రైతు భూమి కబ్జా..
ఏపీలో వైసీపీ నేతల కబ్జాల పర్వానికి అడ్డుకట్ట పడటం లేదు.. కనిపించిన భూమినల్లా కబ్జా చేస్తూ అడ్డుకున్న రైతులపైనే దాడులకు తెగబడుతున్నారు.. తాజాగా ప్రకాశం జిల్లాలో..

ఏపీలో వైసీపీ నేతల కబ్జాల పర్వానికి అడ్డుకట్ట పడటం లేదు.. కనిపించిన భూమినల్లా కబ్జా చేస్తూ అడ్డుకున్న రైతులపైనే దాడులకు తెగబడుతున్నారు.. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ మాజీ ఎంపీపీ రెచ్చిపోయాడు.. ఓ రైతు భూమిని కబ్జా చేశాడు.. అడ్డుకున్నందుకు తన అనుచరులతో బాధితుడిపైనే దాడిచేయించాడు.. అధికార పార్టీ నేతల దౌర్జన్యాన్ని ఎదుర్కోలేక మనస్తాపంతో రైతు ఆత్మహత్యకు యత్నించాడు.. బండరాయితో తలపై కొట్టుకున్నాడు.. తీవ్రగాయం కావడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన పెద్దారవీడు మండలం తంగిరాలపల్లె పంచాయతీ పరిధిలోని తంమ్మడపల్లె గ్రామంలో జరిగింది..

తంబడపల్లె గ్రామానికి చెందిన రైతు చినగంగరాజు 25 ఏళ్లుగా భూమిని సాగు చేసుకుంటున్నాడు.. మల్లారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ వెంకటరెడ్డి కన్ను ఈ భూమిపై పడింది.. అనుచరులతో వచ్చి ఆ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు.. నెలరోజులుగా ఈ వ్యవహారం నడుస్తోంది.. అధికార పార్టీ నేతల దౌర్జన్యకాండపై బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేశాడు.. ఎమ్మార్వో తోపాటు ఇతర రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు.. మూడు రోజుల క్రితం కూడా మాజీ ఎంపీపీ దౌర్జన్యానికి దిగడంతో బాధితుడు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు.. ఆ తర్వాత ఎస్సై ఫోన్‌ కాల్‌తో ఎమ్మార్వో ఆఫీస్‌కు పంచాయితీ చేరింది.. అక్కడా సదరు అధికార పార్టీకి చెందిన నేతకే అనుకూలంగా అధికారులు మాట్లాడారు.

మళ్లీ ఈరోజు అనుచరులను వెంటబెట్టుకుని పొలానికి వెళ్లిన మాజీ ఎంపీపీ వెంకటరెడ్డి గుంతలు తవ్వి ఫెన్సింగ్‌ వేసేందుకు ప్రయత్నించాడు.. రైతు చినగంగరాజు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో గొడవ జరిగింది.. తన దగ్గర రికార్డులు ఉన్నాయని చెప్పినా చినగంగరాజు మాటను రెవెన్యూ అధికారులు కూడా పట్టించుకోలేదు.. అధికారులు కూడా మాజీ ఎంపీపీకే సహకరించడంతో దౌర్జన్యాన్ని ఎదుర్కోలేక మనస్తాపం చెందిన చినగంగరాజు పొలంలోనే ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు.

Tags

Next Story