Andhra Pradesh News : కూటమి ప్రభుత్వ ఏర్పాట్లపై ప్రజల హర్షం..

Andhra Pradesh News : కూటమి ప్రభుత్వ ఏర్పాట్లపై ప్రజల హర్షం..
X

ఏపీలో మొంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎటు చూసినా ఈదురు గాలులు, వాన బీభత్సమే కనిపిస్తోంది. తుఫాన్ ప్రభావాన్ని ముందే ఊహించిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఎన్ని రకాల ఏర్పాట్లు చేయాలో అన్నీ చేసేశారు. ప్రకృతి విపత్తులను ఆపడం ఎవరి తరం కాదు కానీ.. దాన్ని ఎంత సమర్థతతో ఎదుర్కున్నాం అనేదే ఇక్కడ ముఖ్యం. ఒక్క ప్రాణం కూడా పోవొద్దు అనేది సీఎం చంద్రబాబు ఉద్దేశం. అందులో భాగంగానే తుఫాన్ ప్రభావం ఉండే జిల్లాల్లో పునరావాస కేంద్రాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. తుఫాన్ దాడి ఎక్కువగా ఉండే కాకినాడలోనే 269 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఈ పునరావాస కేంద్రాల్లో ఉండే వారికి నాణ్యమైన భోజనం, ఉదయం టిఫిన్, పాలు, బిస్కెట్లు, చిన్న పిల్లలకు అల్పాహారం, స్నాక్స్, బ్రెడ్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి రెండు కూరలతో మంచి ఆహారం పెడుతున్నారు. పునరావాస కేంద్రాల్లో ఎక్కడా అపరిశుభ్రత లేకుండా చూస్తున్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా డాక్టర్లను 24 గంటలు అందుబాటులో ఉంచుతూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. అందరికీ సరిపోయేలా షెల్టర్లను ఏర్పాటు చేశారు. టీవీ5 స్వయంగా పునరావాస కేంద్రాలకు వెళ్లి ప్రజలను ఏర్పాట్లపై ప్రశ్నించగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇళ్ల వద్ద ఉంటే ఇంత ధైర్యంగా ఉండేవాళ్లం కాదంటున్నారు. తమకు ఇంటి కంటే ఇక్కడే ఎక్కువ వసతులు ఉన్నాయంటున్నారు.

ఇంతటి వర్షంలో తమ ఇంటి వద్ద ఇంత నాణ్యమైన భోజనం ఉండేది కాదని.. ప్రభుత్వం ముందే జాగ్రత్తలు తీసుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇక్కడకు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 3వేల మందికి పైగా గర్భిణీలను పునరావస కేంద్రాల్లో డాక్టర్ల సమక్షంలో ఉంచారు. వృద్ధులను కూడా పునరావస కేంద్రాల్లో ప్రత్యేకంగా ఉంచుతున్నారు. తుఫాన్ ప్రభావంతో ఇబ్బంది ఉండే ప్రతి ఏరియాకు ప్రభుత్వ అధికారులు వెళ్తున్నారు. అక్కడ సమస్యలపై స్పందిస్తూ సాయం చేస్తున్నారు. వాగులు, వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు. చెరువులు తెగిపోకుండా బస్తాలతో కట్టుదిట్టం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్ష ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వమే ఆహారం అందిస్తోంది. కరెంట్ సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్ బృందాలు ఎక్కడికక్కడ పనుల్లో ఉన్నారు. చెట్లు విరిగిపోతే క్లియర్ చేస్తున్నారు. ఇండ్లు మునిగిపోతే ప్రజలను తీసుకొస్తున్నారు. ప్రతి నిముషం కూటమి నేతలు, అధికారులు ప్రజల మధ్యే ఉంటున్నారు. ఇదంతా సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తక్షణం స్పందిస్తున్నారు. ఇలా కూటమి తీసుకుంటున్న చర్యలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Next Story