Scorpion Festival : అక్కడ తేళ్లతో పండగ చేసుకుంటారు..

Scorpion Festival : తేలు కనిపిస్తే చాలు భయపడి పరుగులు తీస్తాం. ఇక అది కుట్టిదంటే విలవిలాడిపోతాం. ప్రాణం పోయినంత పనైందని ఫీలవుతుంటాం. కానీ కర్నూలు జిల్లా కోడుమూరు ప్రాంతవాసుల నమ్మకం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక్కడ తేలు కనిపిస్తే అదృష్టంగా భావిస్తారు. భయాన్ని పక్కన పెట్టి భక్తితో వాటిని పట్టుకుంటారు. వాటిని మాలగా పేర్చి దేవుడికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.
శ్రావణమాసం మూడో సోమవారం వచ్చిదంటే చాలు కర్నూలు జిల్లా కోడుమూరులో తేళ్ల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. కోడుమూరులోని ఎర్రటి ఎత్తైన కొండపై చిన్న గుడిలో కొండల రాయుడి రూపంలో వేంకటేశ్వరస్వామి కొలువు దీరారు. కొండపై దొరికే తేళ్లను ఈ దేవుడు ఇష్టపడతారని భక్తులు నమ్ముతారు. తేళ్లను చేతితో పట్టుకొని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. చిన్నపిల్లలు సైతం తేళ్లను పట్టుకొని మొక్కులు తీర్చుకుంటారు.
వేంకటేశ్వరస్వామి మహిమ వల్లే ఇక్కడ తేలు కూడా దేవుడుగా మారిపోయిందంటారు భక్తులు. ఈ కొండపై ఏ రాయిని కదిలించిన జరజరమంటూ తెళ్ళు బయటకు వస్తాయి. శ్రావణమాసం మూడవ సోమవారం ఈ కొండపై దేవుడు దర్శనం కోసం వచ్చే భక్తులు ముందు తేళ్ల వేట మొదలు పెడతారు. తేలు కనిపిస్తే అదృష్టంగా భావిస్తారు. దానికి దారం కట్టి స్వామి వారికి హారంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.
తేళ్ల మాలను స్వామికి సమర్పిస్తే తమకు మంచి జరుగుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. అయితే స్వామి మహిమ వల్ల తేళ్లు తమను కుట్టవంటారు భక్తులు. ఒక వేళ కుట్టినా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే నొప్పి పోతుందని చెప్తున్నారు. ఇక ఈ తేళ్లతో చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తారు భక్తులు. తేళ్లను శరీరంపై వేసుకొని వీరు చేసే విన్యాసాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అయినా తేళ్లు తమను ఏమి చేయవని భక్తులు అంటున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com