AP Government: జగన్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత.. ముందస్తు ఎన్నికలకు వ్యూహాలు!!

AP Government: జగన్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత.. ముందస్తు ఎన్నికలకు వ్యూహాలు!!
X
AP Government: ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం పొంచి వుందా..? వచ్చే ఏడాది మే లేదంటే అక్టోబరులో ఎన్నికలు జరిగే ఛాన్స్‌ కనిపిస్తోందా..?

AP Government: ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం పొంచి వుందా..? వచ్చే ఏడాది మే లేదంటే అక్టోబరులో ఎన్నికలు జరిగే ఛాన్స్‌ కనిపిస్తోందా..? జగన్‌ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకూ పెరిగిపోతోందా..? ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి ముందుగానే గమనించారా..? జగన్‌ను ఓటమి భయం వెంటాడుతోందా...? అందుకే ఆయన ముందస్తు ఆలోచన చేస్తున్నారా..? ఇలాంటి ఎన్నో చర్చలు పొలిటికల్‌ సర్కిల్స్‌లో జరుగుతున్నాయి.. 2024 వరకు ప్రభుత్వాన్ని జగన్‌ నడపలేరని విపక్షాలు కూడా కోడై కూస్తున్నాయి.. అందుకే, ముందస్తు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి.



ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏపీలో ఉన్నాయా అంటే.. విపక్షాల నుంచి అవుననే సమాధానం గట్టిగా వినిపిస్తోంది.. ముఖ్యంగా ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను అంతా గుర్తు చేస్తున్నారు.. అంతేకాదు, ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని, పరిమితికి మించిన అప్పులతో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తోందని జగన్‌ ప్రభుత్వంపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.. అభివృద్ధి లేకపోగా, అప్పులతోనే సంక్షేమ పథకాలను నెట్టుకొస్తున్నారన్నది జనమెరిగిన సత్యం.. కానీ, ఇప్పుడు కేంద్రం కూడా అప్పుల విషయంలో రివర్స్‌ అవుతుండటంతో అప్పులు పుట్టే పరిస్థితి కనిపించడం లేదు.. కొద్దో గొప్పో రాబడి ఉన్నా.. అది కూడా అప్పులకు వడ్డీ కట్టడానికే సరిపోతోంది..




ఇటు చూస్తూ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ప్రతి నెలా ఇబ్బందులు తప్పడంలేదు.. గత నెల వరకు ఏదో ఒక విధంగా అప్పులతో జీతాలు చెల్లించినా.. ఈనెల ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది.. ఈరోజు వరకు ఉద్యోగులకు జీతాలు అందకపోవడంతో వారు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.. అటు అప్పులతోనే నవరత్నాలను అమలు చేస్తున్న జగన్‌ సర్కార్‌కు.. ఇప్పుడు వాటిని ఎలా కొనసాగించాలనే ఆందోళన వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం ఏపీ ఆర్థిక ఎమర్జెన్సీ దిశగా పయనిస్తోందని.. ఇక ఎక్కువ కాలం జగన్‌ ప్రభుత్వాన్ని నడపలేరని విపక్షాలు అంటున్నాయి. ఇప్పటికే జగన్‌కు పరిస్థితి అర్థమైపోయిందని.. అందుకే ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తున్నారనేది ప్రతిపక్షాల అంచనా.

రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడం కూడా ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని కనీసం రిక్వెస్ట్‌ కూడా చేయలేని ప్రభుత్వం వైసీపీ అంటూ ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి విమర్శల దాడి పెరుగుతోంది.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించుకుంటామని చెప్పిన జగన్‌.. ఇప్పుడు కనీసం అడిగే సాహసం కూడా చేయడం లేదని అంటున్నారు.. అంతేకాదు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరం చేస్తున్నా కేంద్రాన్ని కనీసం ప్రశ్నించలేదని అంటున్నారు..




పోలవరం ప్రాజెక్టుపైనా ప్రభుత్వం చేతులెత్తేసిందని నిధుల కోసం కేంద్రాన్ని అడిగే పరిస్థితి కూడా కనిపించడం లేదని గుర్తు చేస్తున్నారు.. ఇలాంటి ఎన్నో విషయాల్లో ఇప్పటి వరకు కేంద్రాన్ని డిమాండ్‌ చేయలేకపోయారు జగన్‌.. ఇవేకాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, దోపిడీలు, అరాచకాలు అన్నీ ప్రజలు గమనిస్తున్నారన్న సంగతి అర్థమైపోయిందని విపక్షాలు అంటున్నాయి.... గడప గడపలో అధికార పార్టీ నేతలకు ఎదురవుతున్న పరాభవాలు, ప్రతిఘటనలతో సీనంతా 70 ఎంఎం స్కోప్‌లో కనిపిస్తోందని అంటున్నాయి.. అందుకే సాధ్యమైనంత త్వరగా అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో జగన్‌ ఉన్నట్లుగా కొందరంటున్నారు.



వాస్తవానికి వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి అన్ని వర్గాలు సహకరించాయి.. ఆ కారణంగానే వైసీపీకి 151 సీట్లు వచ్చాయి.. ఇంత తిరుగులేని ఆధిపత్యాన్ని ఇచ్చినా జగన్‌ ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకోలేకపోయిందనే విమర్శలున్నాయి.. నాడు ఓటేసి గెలిపించిన అవే వర్గాలు ఇప్పుడు జగన్‌ ప్రభుత్వాన్ని సాగనంపాలనే నిర్ణయానికి వచ్చాయనే చర్చ జరుగుతోంది.. కోరి తెచ్చుకున్న, రెండు చేతులతో ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రభుత్వం కారణంగా తాము రోడ్డున పడ్డామని ఉద్యోగులంతా వాపోతున్నారు.. అదనపు బెనిఫిట్స్‌ సంగతి దేవుడెరుగు.. నెలనెలా జీతాల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్డెక్కి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.. ప్రభుత్వంపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో దీనిని బట్టే అర్థమవుతోందని చూసిన వారంతా చెప్తున్నారు.



ఏపీ ఆర్థిక పరిస్థితి రానురాను దిగజారిపోతుండటం, ప్రభుత్వాన్ని నడపలేని సిచ్యుయేషన్‌లోకి వెళ్లిపోవడంతోనే జగన్‌ అయోమయంలో పడిపోయారని.. అందుకే ముందస్తు ఆలోచన చేస్తున్నారనేది విపక్షాల మాట.. ప్రభుత్వాన్ని నడపలేక జగన్‌ ఇబ్బంది పడుతున్నారని బహిరంగంగానే వారంతా విమర్శిస్తున్నారు.. ప్రజల్లో పెరిగిపోతున్న వ్యతిరేత కారణంగా వచ్చే ఎన్నికల్లో గెలవలేమనే అంచనాకు జగన్‌ వచ్చేశారని.. ముందస్తుకు వెళ్తే పరాభవం నుంచి కొంతైనా తప్పించుకోవచ్చని, అదే సమయంలో విపక్షాలను ఊపిరాడకుండా చేయొచ్చనేది ఆయన ఆలోచనగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.




అది సాధ్యపడుతుందా లేదా అనేది పక్కన పెడితే ముందస్తు ఆలోచనకు అసలు కేంద్రం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చే పరిస్థితి లేదని వారంటున్నారు.. ఇటీవల ప్రధాని మోదీని కలిసిన సందర్భంలో జగన్‌ ముందస్తు ప్రస్తావన తీసుకొచ్చినట్లుగా సమాచారం.. అయితే, మోదీ మాత్రం సార్వత్రిక ఎన్నికలతోపాటే వెళ్లాలని సూచించినట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.. మోదీ నిర్ణయాన్ని కాదని జగన్‌ అడుగు ముందుకు వేయడం అసాధ్యమని విశ్లేషకులు అంటున్నారు.



నిన్న మొన్నటి వరకు మూడు రాజధానుల అంశంతో ఎన్నికలకు వెళ్తే విజయం ఖాయమనే అభిప్రాయం జగన్‌లో ఉండేది.. కానీ, సుప్రీంకోర్టు తీర్పుతో అది కూడా సన్నగిల్లిందని విశ్లేషకులు అంటున్నారు.. శాసనసభకు రాజధానిని నిర్ణయించే అధికారం లేదని న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పాయి.. అందుకే, మూడు రాజధానుల విషయాన్ని జగన్‌ ఈ మధ్యకాలంలో ఎక్కడా ప్రస్తావించడం లేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.. ఒకరిద్దరు ఉత్తరాంధ్ర మంత్రులు మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి మాత్రం మౌనంగానే ఉంటున్నారని.. ఈ ఫార్ములా వర్కవుట్‌ కాదని జగన్‌ కూడా అర్థమైపోయిందని అంటున్నారు..




అటు మోదీ కూడా ముందస్తు ఆలోచన వద్దని చెప్పడంతో జగన్‌ ఇప్పుడు అయోమయంలో పడిపోయారని అంటున్నారు.. ముందస్తు ఎన్నికలు అసాధ్యమని జగన్‌కు తెలిసినప్పటికీ.. పార్టీ శ్రేణుల్ని యాక్టివ్‌ చేయం కోసమే ఆమాటలు చెబుతున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఎప్పుడూ లేనిది, కార్యకర్తలకు పదువులు, డబ్బులు ఇచ్చి ప్రోత్సహించడం కూడా ఇందులో భాగమేనంటున్నారు.. వాలంటీర్లను పక్కన పెట్టి మంత్రులకు ఆ బాధ్యతలు ఇవ్వడం, టీవీ5 సహా మీడియా చూస్తోందని, అవినీతికి పాల్పడవద్దని మంత్రులకు హితబోధ చేయడం.. కనీసం ఆఫీసులు, కుర్చీలు కూడా లేని కార్పొరేషన్‌ ఛైర్మన్లను హడావిడిగా పిలిపించుకుని బుజ్జగించడం చూస్తుంటే ముందస్తు లెక్కలు గట్టిగానే వేసుకుంటున్నారని పొలిటికల్‌ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

Next Story