AP: అమరావతిలో పైప్‌లైన్ల ద్వారా గ్యాస్ సరఫరా

AP: అమరావతిలో పైప్‌లైన్ల ద్వారా గ్యాస్ సరఫరా
X
కీలక ప్రతిపాదనలు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. సీఎస్‌తో కీలక చర్చలు

దేశంలోనే పూర్తిగా పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ వినియోగించే రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ప్రతిపాదించింది. పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ రెగ్యులేటరీ బోర్డు సభ్యుడు రమణకుమార్‌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌తో సమావేశమైంది. ఈ సమావేశంలో ఏపీలో చేపట్టిన గ్యాస్‌ పైప్‌లైన్ల నిర్మాణ ప్రాజెక్టులపై ఇరు బృందాలు చర్చించాయి. గుజరాత్‌లోని గాంధీనగర్‌ జిల్లా గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌-టెక్‌ సిటీలో గ్యాస్, విద్యుత్, టెలికం కేబుళ్లు మొత్తం భూగర్భంలోనే ఉంటాయి. ఆ నగరంలో అన్ని ఇళ్లకూ పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ అందుతోంది. అదే తరహాలో రాజధాని అమరావతికి పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ అందించి, దేశంలో మొట్టమొదటి పైప్‌ గ్యాస్‌ వినియోగించే రాజధానిగా చేస్తామని ఐవోసీ బృందం తెలిపింది. ఈ ప్రతిపాదనకు సీఎస్‌ అంగీకారం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో గ్యాస్‌ పైప్‌లైన్‌ ద్వారా 80 లక్షల కుటుంబాలకు కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఏపీ గ్యాస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. గ్యాస్‌ పైప్‌లైన్ల నిర్మాణ పురోగతి, సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ పనులపై ఆయన చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆ దిశగా పీఎన్‌జీఆర్‌బీ సహకారం అందించాలన్నారు. పైప్‌లైన్ల నిర్మాణానికి క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురైతే, పరిష్కారానికి ప్రభుత్వం సహకరిస్తుందని దినేశ్‌ హామీ ఇచ్చారు.

Tags

Next Story