ప్రధాని మోదీకి పవన్ అంటే చాలా ఇష్టం: సోమువీర్రాజు

పవన్‌కల్యాణ్‌ను ఏపీకి అధిపతిని చేయాలనే ఆలోచన బీజేపీకి ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సోమువీర్రాజు. ప్రధాని మోదీకి పవన్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. పవన్‌ని జాగ్రత్తగా చూసుకోవాలని బీజేపీ రాష్ట్ర నేతలకు మోదీ చెప్పినట్టు కూడా కామెంట్ చేశారు. 2014 ఎన్నికల ప్రచారంలో మోదీతో పాటు పవన్ హెలికాప్టర్‌లో తిరిగారని, ఏడు నియోజకవర్గాల్లో మోదీతో కలిసి ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ఉన్నట్టుండి పవన్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఆంతర్యం ఏంటనే చర్చ జరుగుతోంది. బీజేపీతో పొత్తుపై జనసేన కార్యకర్తలు ఒకింత ఆగ్రహంగా ఉన్నారు. విశాఖ, విజయవాడ కార్పొరేషన్లలో బీజేపీతో పొత్తు కారణంగానే అనుకున్నన్ని సీట్లు రాలేదని జనసైనికులు బహిరంగంగానే ఆగ్రహం వెల్లగక్కారు. బీజేపీతో పొత్తు కారణంగా ఓ వర్గం వాళ్లకి దూరమయ్యామని కూడా చెప్పారు.
ఇప్పుడు తిరుపతి సీటు జనసేనకు కాకుండా బీజేపీ అభ్యర్థినే దింపడంతో జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ ప్రచారానికి రాకపోతే అసలుకే నష్టం జరుగుతుందని బీజేపీ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమువీర్రాజు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది.
తిరుపతి నియోజకవర్గ పరిధిలో బలిజ కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. వీళ్లంతా ఒకప్పుడు చిరంజీవిని తమవాడని భావించి గెలిపించారు. ఇప్పుడు పవన్ వచ్చినా ఆదరిస్తారని జనసేన అంచనా. అందుకే, తిరుపతి టికెట్ కోసం అంతగా పట్టుబట్టింది. తీరా బీజేపీ బరిలో దిగడం, ఆ నిర్ణయం జనసేనకు నచ్చకపోవడంతో ప్రచారానికి సైతం దూరంగానే ఉన్నారు.
తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. ఈ ఎన్నికల్లో కనీస పోటీ ఇవ్వాలంటే జనసేన మద్దతు అవసరం. అందులోనూ పవన్ ప్రచారానికి రావడం చాలా ముఖ్యం. అందుకే, సోమువీర్రాజు, పురంధేశ్వరితో కలిసి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ.. హైదరాబాద్‌లోని పవన్ ఇంటికి వెళ్లారు.
తన గెలుపు కోసం ప్రచారం చేయాల్సిందిగా కోరారు. సోమువీర్రాజు చేసిన ఈ కామెంట్స్‌లో జనసైనికులు చల్లబడతారా లేదా అన్నది తేలాల్సి ఉంది.ఇప్పటికే తెలంగాణలో బీజేపీ,జనసేన మధ్య ఉప్పు నిప్పులా పరిస్థితి ఉంది. ఇంతకీ పవన్ తిరుపతి ఎన్నికల ప్రచారానికి వెళ్తారా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com