AP: సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ విచారం

AP: సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ విచారం
X
మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా.. తీవ్రంగా కలచి వేసిందన్న చంద్రబాబు

సింహాచలం దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన మోదీ... పీఎం సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆక్షాంక్షించారు. మరోవైపు సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకోవడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. సింహాచలం ఘటన చాలా దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న పవన్.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

స్పందించిన చంద్రబాబు

వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి భక్తులు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. 'ఈ ఘటన నన్ను కలచి వేసింది. భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అక్కడి పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడాను. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించాను. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాను.' అని ట్వీట్ చేశారు.

విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం

సింహాచలం దుర్ఘటనపై విశ్వ హిందూ పరిషత్‌ తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వం సరైన రీతిలో చర్యలు చేపట్టలేదని ఆరోపించింది. చందనోత్సవంలో ఓ ప్రణాళిక లేదని, ప్లానింగ్‌ లేదని మండిపడింది. హుండీలో భక్తులు వేసే డబ్బులతోనే ఎండో మెంట్‌ వ్యవస్థ నడుస్తోందని, కానీ భక్తులను పట్టించుకోవడం లేదన్నారు. హిందూ సాంప్రదాయాలు, సంస్కృతి తెలిసిన వాళ్లకు మాత్రమే ఎండోమెంట్‌లో ఉండాలని డిమాండ్ చేసింది

Tags

Next Story