PM: నేడే ప్రధాని మోదీ విశాఖ పర్యటన

PM: నేడే ప్రధాని మోదీ విశాఖ పర్యటన
X
ఏర్పాట్లన్నీ పూర్తి.... కీలక ప్రాజెక్టులకు శంకుస్ధాపన చేయనున్న ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జనవరి 8న సాయంత్రం 4.15 గంటలకు ప్రధాని విశాఖ చేరుకుంటారు. సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వరకు నిర్వహించనున్న రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

కీలక ప్రాజెక్టులు ప్రారంభించనున్న మోదీ

ప్రధాని మోడీ రాకతో ఏపీలో కోట్ల విలువైన ప్రాజెక్టులు శంకుస్థాపన చేయనున్నారు. రూ.2,08,548 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శంకుస్థాపన చేస్తున్న ప్రాజెక్టుల విలువ రూ.1,99,786 కోట్లు కాగా, వీటిలో రూ.1,87,885 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉత్తరాంధ్రకు చెందినవే కావడం విశేషం.ఈ ప్రాజెక్టులు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్ట్ 1.85 లక్షల కోట్లు తో ప్రారంభిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 25 వేల మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలుపుతున్నారు.

తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని

ఏపీ, ఒడిశాలలో ప్రర్యటించనున్నట్లు ప్రధాని మోదీ రెండు రాష్ట్రాల భాషల్లో ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటాను. విశాఖ ప్రజల మధ్య సమయం గడిపేందుకు ఎదురుచూస్తున్నాను. అనకాపల్లి జిల్లాలో భారీ ఔషధ పరిశ్రమ, కృష్ణ పట్నం పారిశ్రామిక ప్రాంతంల శంకుస్థాపన కార్యక్రమాలలో కూడా పాల్గొంటానని పేర్కొన్నారు.

భారీ బందోబస్తు

ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభా ఏర్పాటుకు సంబంధించి పనులు చకాచకా సాగుతున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత, పలువురు ఎమ్మెల్యేలు, కూటమి నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సభా ఏర్పాట్లను పరిశీలించారు.

Tags

Next Story