Polavaram Project : ఇప్పటికీ పెండింగ్‌లో పోలవరం భవిష్యత్తు

Polavaram Project : ఇప్పటికీ పెండింగ్‌లో పోలవరం భవిష్యత్తు
తేలని తొలిదశ నిధుల అంశం

పోలవరం ప్రాజెక్టుకు తొలిదశ నిధుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. కేంద్ర జలసంఘం ప్రతిపాదనలను రివైజ్డ్ కాస్ట్ కమిటీ పరిశీలించినా.. ఇంకా తన సిఫార్సులు సమర్పించలేదు. ఈ జాతీయ ప్రాజెక్టుకు తదుపరి నిధులు విడుదల కావాలంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య M.O.U. తప్పనిసరని కేంద్ర జలశక్తి శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ M.O.U.తో పాటు ఇప్పటికే D.P.R. 2కు కేంద్ర సాంకేతిక సలహామండలి ఆమోదించిన మొత్తానికి, లేదా రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఆమోదించిన మొత్తానికి అనుమతులు రావాలి. ఈ నెలాఖరు లోపు..అనుమతులు రాకుంటే ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యం కానుంది.

పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనుల పూర్తికి 36 వేల449.83 కోట్ల రూపాయలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర జల సంఘం ఆ ప్రతిపాదనలను పరిశీలించి, కొంత కోత పెట్టి 31వేల625.38 కోట్ల రూపాయలకే సిఫార్సు చేసింది. ఆ మొత్తం రివైజ్డ్ కాస్ట్ కమిటీ పరిశీలనకు వెళ్లింది. ఇప్పటికే దీనిపై రెండు మూడు సమావేశాలు నిర్వహించినా వారు ఎంతకు సిఫార్సు చేస్తారనేది తేలలేదు. వారి సిఫార్సులు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు వెళ్లాలి. అక్కడి నుంచి ఆర్థికశాఖ ద్వారా కేంద్ర మంత్రిమండలి ముందు ఉంచితే అప్పుడు తొలిదశ నిధులకు ఆమోదం లభిస్తుంది. ఆ తర్వాతే కేంద్రం నుంచి నిధులు విడుదలవుతాయి. పోలవరం నిధుల్లో ఇప్పటికే 2వేల కోట్ల వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉంది.

పోలవరం ప్రధాన డ్యాం మొత్తం తొలిదశలోనే పూర్తిచేస్తామని అధికారులు చెప్పినా అందులోనూ కొన్ని పనులు పెండింగులో ఉంచినట్లు తెలిసింది. ప్రాజెక్టు ప్రాంతంలో నీళ్లున్నప్పుడు చేయలేని వాటిని రెండోదశలో చేయొచ్చని కేంద్ర జలసంఘం వెల్లడించింది. స్పిల్ వే కాంక్రీటు పనులు కొంతమేర పెండింగులో ఉన్నాయి. వాటిని రెండోదశకే పరిమితం చేయాలని నిర్ణయించారు. గైడ్‌బండ్‌ను ఆనుకుని పైడిపాక కొండవద్ద చేయాల్సిన పనులనూ రెండోదశకే చేర్చారు. ప్రధాన డ్యాంలోనే వెయ్యి కోట్ల రూపాయల పనులను రెండోదశకు వదిలినట్లు తెలిసింది. ఇవికాక కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి పచ్చజెండా ఊపితే దానికీ నిధులు అవసరమవుతాయి. ఎడమ, కుడి కాలువల్లో పాత డిజైన్ల మేరకే నిధులు ఇచ్చేందుకు కేంద్ర జల సంఘం సమ్మతించింది. 2010-11 ఆకృతుల ప్రకారం రెండు కాలువల్లో ప్రవాహ సామర్థ్యం తక్కువ. ఆ మేరకే కాలువ తవ్వకం, లైనింగ్, కట్టడాల పనులకు నిధులిస్తామని, మిగిలినవి ఇవ్వబోమని తేల్చిచెప్పింది

Tags

Read MoreRead Less
Next Story