Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం.. స్పిల్‌వేలో 48 రేడియల్ గేట్లు..

Polavaram Project (tv5news.in)
Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. స్పిల్‌వేలో 48 రేడియల్ గేట్లను అమర్చింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. 2020 డిసెంబర్ 17న గేట్ల అమరిక పనులు ప్రారంభించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ.. గత సీజన్‌లో వరదలు వచ్చే సమయానికి 42 గేట్లు అమర్చి, వరద నీటిని దిగువకు విడుదల చేసింది. మిగిలిన 6 గేట్ల అమరిక పనులు సైతం పూర్తయ్యాయి.
ఇప్పటికే రేడియల్ గేట్లకు అమర్చాల్సిన 96 హైడ్రాలిక్ సిలిండర్లకు గాను 84 సిలిండర్లను అమర్చారు. త్వరలోనే మిగిలిన 6 గేట్లకు 12 సిలిండర్లు అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చడం పూర్తైతే గేట్లు ఆపరేట్ చేయొచ్చని మేఘా ఇంజనీరింగ్ సంస్థ తెలిపింది. గేట్లను ఎత్తడానికి అవసరమైన 24 పవర్ ప్యాక్ సెట్లను ఇప్పటికే అమర్చడం పూర్తి చేశారు.
10 రివర్ స్లూయిజ్ గేట్లను, వాటికి 20 హైడ్రాలిక్ సిలిండర్లతో పాటు 10 పవర్ ప్యాక్ సెట్లను కూడా అమర్చడం పూర్తి చేశారు. స్పిల్‌వే కాంక్రీట్ పనులు దాదాపు 97.25 శాతానికి పైగా పూర్తయ్యాయి. స్పిల్‌వేలో 3లక్షల 32వేల 114 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేశామని మేఘా ఇంజనీరింగ్ సంస్థ తెలిపింది. ఇక స్పిల్‌వేలో కీలకమైన ఫిష్ ల్యాడర్ నిర్మాణం సైతం పూర్తైంది. గేట్ల ఏర్పాటు పనులను జలవనరుల శాఖ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ సంస్థ సీజీఎం ముద్దుకృష్ణ, డీజీఎం రాజేష్ కుమార్ దగ్గరుండి పరిశీలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com