POLAVARAM: పోలవరంపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కూటమి సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టు కంపెనీలు మేఘా, బావర్‌ను ఆదేశించింది. ప్రాజెక్ట్ మెయిన్ డ్యాం పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.2,348 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించింది. డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని నవంబర్ 1న ప్రారంభించి 2025 నవంబర్ వరకు పూర్తి చేయాలని పేర్కొంది.
డయాఫ్రం వాల్ పనులు అప్పటినుంచే..
పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబరులో ప్రారంభించి 2025 నవంబరు నాటికి పూర్తి చేయాలని జలవనరులశాఖ ప్రణాళిక రూపొందించింది. అవసరమైన పరిశోధనలు, పరీక్షలు పూర్తి చేసుకుని డిజైన్లు రూపొందించుకుని ప్రధాన డ్యాం నిర్మాణం మొత్తం 2025 నవంబరులో ప్రారంభించి 2027 జులై నాటికి పూర్తి రూపం ఇవ్వాలని ప్రతిపాదించారు. పోలవరం అధికారులు, నిర్మాణ ఏజెన్సీ తదితరులు కలిసి ప్రాథమికంగా ఈ షెడ్యూలును రూపొందించారు. డయాఫ్రంవాల్ డిజైన్లను అఫ్రి డిజైన్ కన్సల్టెన్సీ అక్టోబరు 16 నాటికి పూర్తి చేసి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సమర్పించనుంది. ఈ డిజైన్లపై నవంబరు మొదటివారంలో జరిగే వర్క్‌షాపులో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. కేంద్రజలసంఘం, విదేశీ నిపుణుల బృందం ఈ డిజైన్లను నవంబరు 15వ తేదీలోపు ఆమోదించాల్సి ఉంటుంది. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణంలో మెటీరియల్‌ను ఎలా సమ్మిళితం చేయాలన్నదానిపై తిరుపతి ఐఐటీ నిపుణులు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. వర్క్‌షాపులో వాటిని సమర్పించి చర్చిస్తారు. డయాఫ్రం వాల్ కట్టడంలో ప్యానెల్ నిర్మాణానికి కట్టర్‌ను ఏర్పాటు చేసేలా ప్లాట్‌ఫాం డిసెంబరు ప్రారంభానికి సిద్ధమవుతుంది. మిగిలిన కట్టర్ల ఏర్పాటుకు అవసరమైన ప్లాట్‌ఫాం నిర్మాణం డిసెంబరు నెలలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. మూడు ట్రెంచి కట్టర్‌లను రప్పిస్తున్నారు. తొలి కట్టర్ డిసెంబర్ 1వ తేదీ నాటికి పోలవరం చేరుతుంది.
అచ్చెన్న కీలక వ్యాఖ్యలు
పోలవరం ప్రాజెక్టుకు 2500కోట్లు వచ్చాయని, పోలవరం 2027కు పూర్తి చేస్తామని వెల్లడించారు. అమరావతిలో నవంబర్‌లో పనులు మొదలు పెడుతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. లిక్కర్ పాలసీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదని అన్నారు. మద్యం తయారీ అమ్మకాన్ని దగ్గర పెట్టుకుని జగన్ అడ్డంగా దోచుకున్నాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. లిక్కర్‌లో 40 వేలకోట్లు దోచుకున్నారని, 60 రూపాయలు వున్న క్వార్టర్ బాటల్ 250కి అమ్ముకున్నాడని విమర్శించారు. ఏపీలో వ్యవస్థలను సర్వ నాశనం చేశారన్నారు. ఇసుక రీచ్‌లు రేపట్నుంచి మొదలవుతాయని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. పది రోజుల్లో ఇసుక సమస్య తీరుతుందన్నారు. నేరుగా ఇసుకను రీచ్‌లో నుంచే కొనుగోలు చేసే విధంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇసుకను జగన్ గుప్పెట్లో పెట్టుకుని దోచుకున్నాడని ఆరోపించారు. 120రోజుల్లో పాలనలో కూటమి ప్రభుత్వం ఓ నమ్మకాన్ని కల్పించిందని అన్నారు. వర్షాల వల్ల ముంపునకు గురైతే విజయవాడలో బాధితులకు 15 రోజుల్లోనే పరిహారం ఇచ్చామని గుర్తు చేశారు. ఒక ప్రణాళిక బద్దంగా పని చేసి ఉభయ గోదావరి జిల్లాలను అభివృద్ధి చేస్తామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com