MLA Pinnelli Case: పిన్నెల్లి ఎపిసోడ్లో పోలీసులకే రేలాక్స్

హైకోర్టు ఉత్తర్వులు పిన్నెల్లి కంటే పోలీసులకే ఎక్కువ ఊరట కలిగించాయి. ఎమ్మెల్యేను అరెస్టు చేయకుండా రకరకాల డ్రామాలతో నెట్టుకొస్తున్న పోలీసులకు హైకోర్టు ఉత్తరులు ఊపిరి పీల్చుకునేలా చేశాయి.
రాష్ట్రంలో DGPమారినా పోలీసుల తీరు మారలేదనడానికి పిన్నెల్లి పరారీ ఉదంతమే నిదర్శనం. పిన్నెల్లి కోసం పోలీసులు నిజంగానే గాలిస్తున్నారా అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. పిన్నెల్లి పోలీసుల అదుపులో ఉన్నారని కాసేపు, అరెస్టు చేయలేదని కాసేపు బుధవారం అర్ధరాత్రి వరకు ఊహాగానాలు కొనసాగాయి. ఆయన నరసరరావుపేట కోర్టులో లొంగిపోతున్నారని గురువారం ప్రచారం జరిగింది. దాంతో నరసరావుపేట, గురజాల కోర్టుల వద్ద కొందరు పోలీసుల్ని మోహరించారు. అంతకుమించి పిన్నెల్లిపై కేసుల దర్యాప్తులో గానీ, ఆయన ఆచూకీ కనిపెట్టడంలో గానీ పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదు. మరోవైపు..ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు..ఆయనపై జూన్ 6వ తేదీ వరకు ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని ఆదేశించింది. పోలీసులకు కావలసిందీ ఇదే కనుక.......హైకోర్టు ఉత్తర్వులు పిన్నెల్లి కంటే...పోలీసులకే ఎక్కువ ఊరట కలిగించాయి.
పోలింగ్ మర్నాడు కారంపూడి, మాచర్లలో MLA తన అనుచరగణాన్ని వెంటేసుకుని విధ్వంసం సృష్టించడం, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం, ఆస్తుల విధ్వంసం, కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి చేయడంతో ఎమ్మెల్యేను ఈనెల 15న పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. తనపై పోలీసులు కేసులు నమోదుచేయడంతో అరెస్టు తప్పదన్న భయంతో... ఆయన మర్నాడు రాత్రి హైదరాబాద్ వెళ్లిపోయారు. పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నించ లేదు. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి నేలకేసి కొట్టిన వీడియో ఈ నెల 21న వెలుగులోకి వచ్చింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేయడంతో... విధిలేని పరిస్థితుల్లో పోలీసుల్లో కదలిక వచ్చింది. పిన్నెల్లి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని పిన్నెల్లి ఇంటికి సమీపంలో వేచి ఉండటం.. కాసేపటికి ఆయన ఇంటినుంచి బయటకు వచ్చిన కారును వెంబడించడం.. కొంత దూరం వెళ్లాక నిలిచిపోయిన ఆ కారులో పిన్నెల్లి లేకపోవడం.. ఆయన కారు దిగి రోడ్డు దాటి మరో కారులో హైదరాబాద్ వైపు వెళ్లిపోయారని ఎమ్మెల్యే కారు డ్రైవర్, గన్‌మెన్ చెప్పడంతో పోలీసులు అవాక్కై వట్టి చేతులతో వెనుదిరగడం వంటి పరిణామాలు బుధవారం జరిగాయి. ఇదంతా నిజంగానే జరిగిందా? పోలీసులు హైడ్రామానా? అన్న సందేహాలున్నాయి. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి విదేశాలకు పారిపోయారని కూడా ప్రచారం జరిగింది.
పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వులు గురువారం రాత్రి వచ్చాయి. కానీ..అప్పటి వరకు పోలీసుల వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల అక్రమాల్ని అడ్డుకోనందుకు రెంటచింతల SIని సస్పెండ్ చేసినప్పుడే MLAని ఎందుకు అరెస్టు చేయలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయన పొరుగు రాష్ట్రానికి పారిపోయే వరకూ ఎందుకు ఊరుకున్నారు? ఎమ్మెల్యేతోపాటు ఉన్న గన్‌మెన్ పోలీసులే కదా? వారిని సంప్రదించి ఎమ్మెల్యే ఆచూకీ ఎందుకు తెలుసుకోలేదు? హైదరాబాద్‌లో ఎమ్మెల్యేను అరెస్టు చేయడానికే వెళ్లామని చెబుతున్న పోలీసులు...ఆయన ఇంట్లోకి వెళ్లకుండా బయట ఉండటమేంటి? ఆయన కారు ఇంట్లోంచి బయటకు వెళుతుంటే అక్కడే అడ్డుకోకుండా వెంబడించడమేంటి? చివరకు కారులో ఎమ్మెల్యే లేరని, పారిపోయారని చెప్పడమేంటి? ఇదంతా పోలీసుల చేతగానితనం కాదా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com