Posani : ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పోసాని.. కేసులు కొట్టేయాలని పిటిషన్లు

రాష్ట్ర వ్యాప్తంగా కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమురళి హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఇప్పటికే నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ మంగళవారం పిటిషన్లు దాఖలు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తోపాటు మీడియా అధినేతలపై చేసిన వ్యాఖ్యలకు గాను తనపై శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, విజయవాడ సూర్యా రావు పేట, కర్నూలు, ఆదోని టుటౌన్ పోలీసులు వేర్వేరుగా నమోదు చేసిన కేసులను కొట్టేయాలని పిటిషన్లలో అభ్యర్థించారు. రాజకీయ, వ్యక్తిగత ద్వేషంతో తనపై తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా బహుళ ఎఫ్ఎస్ఐఆర్ లు నమోదు చేస్తున్నారని, కేసులు నమోదు చేసేంత నేరం తాను చేయలేదన్నారు.
నేరం చేశాననడానికి ప్రాధమిక ఆధారాలేవీ లేవని, తన పట్ల పోలీసులు దురుద్ధేశ్యంతో వ్యవహరిస్తున్నారని పిటిషన్లలో వివరించారు. వర్గాలు, మతాల మధ్య విధ్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశానంటూ పోలీసుల ఆరోపణల నేపధ్యంలో తన వ్యాఖ్యల్లో అలాంటి అంశాలు లేవన్నారు. అసలు ఫిర్యాదుల్లో లేని అంశాలపై కూడా తనమీద కేసులు నమోదు చేశారన్నారు. అర్నేష్ కుమార్ మార్గదర్శకాల ప్రకారం తనకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసులు ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని, వీటిని పరిగణనలోకి తీసుకుని ఆయా కేసుల్లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పోసాని పిటిషన్లలో కోర్టును అభ్యర్థించారు. కాగా ఆయా పిటిషన్లపై గురువారం విచారణ జరిగే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com