POSANI: జడ్జి ముందు వెక్కివెక్కి ఏడ్చిన పోసాని

POSANI: జడ్జి ముందు వెక్కివెక్కి ఏడ్చిన పోసాని
X
రెండు రోజుల్లో తనకు బెయిల్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్న పోసాని

సినీ నటుడు, వైసీపీ సానుభూతిపరుడు, ఏపీ ఎఫ్‌డీసీ మాజీ ఛైర్మన్.. పోసాని కృష్ణమురళీ... జడ్జీ ముందు వెక్కివెక్కి ఏడ్చారు. తాను తప్పు చేస్తే నరికేయండని అన్నారు. 70 ఏళ్ల వయసులో తనను ఇబ్బంది పెడుతున్నారని, తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని పేర్కొన్నారు. ఇప్పటికే రెండు ఆపరేషన్లు, స్టంట్లు వేశారని చెప్పారు. ఇక రెండు రోజుల్లో తనకు బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యమని జడ్జి ఎదుటే పోసాని వాపోయారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‍పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని గుంటూరు జడ్జీ ముందు హాజరుపరిచారు. కర్నూలు జైలు నుంచి ఆయన్ని నేరుగా జీజీహెచ్‍కు తీసుకువచ్చిన సీఐడీ పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం జడ్జ్ ఇంటికి తీసుకెళ్లి ఆయన ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో పోసాని తరుఫున న్యాయవాదులు పొన్నవోలు, పోలూరి వెంకటరెడ్డి అక్కడికి చేరుకుని వాదనలు వినిపించారు.

జడ్జి ముందు పోసాని ఆవేదన

కక్ష పూరితంగానే తనపై కేసులు పెడుతున్నారని పోసాని.. న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో రిమాండ్‌పై ఇరు పక్షాల వాదనల అనంతరం పోసాని కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. ప్రెస్‌మీట్‌ పెట్టినందుకు ఇన్ని కేసులు పెడతారని తనకు తెలియదని పోసాని వెల్లడించారు. 70 ఏళ్ల వయసులో తనను అనేక ప్రాంతాల్లో తిప్పుతున్నారని... తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. అసలు ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా వాదనలు వినిపిస్తున్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు తనకు లైడిటెక్టర్‌ పరీక్షలు నిర్వహించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. ఇప్పటికే రెండుసార్లు స్టంట్లు వేశారని గొంతు చికిత్స కూడా జరిగిందని ఆరోగ్యం సహకరించడం లేదని పోసాని వాపోయారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. తాను తప్పు చేసినట్టు తేలితే నరికేయాలని అన్నారు. పార్టీ మారలేదనే కక్షతో ఈ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.

పోసానిని పరామర్శించిన వైసీపీ నేతలు

పోసానిని పరామర్శించేందుకు అంబటి రాంబాబు, వైసీపీ నేతలు భారీగా చేరుకున్నారు. అందరం అండగా ఉన్నామని, ఆరోగ్యం ఎలా ఉందంటూ పోసానిని అంబటి వివరాలు అడిగారు. ఆరోగ్యం బాగానే ఉందంటూ పోసాని బదులిచ్చారు. మరోవైపు బాపట్లలో పోసాని కృష్ణమురళీపై మరో కేసు నమోదు అయ్యింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ అందిన ఫిర్యాదు మేరకు బాపట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోసాని పీటీ వారెంట్‌ను అనుమతించాలంటూ తెనాలి కోర్టులో పిటిషన్ వేశారు. పోసాని పీటీ వారెంట్‌ను తెనాలి కోర్టు అనుమతించింది.

Tags

Next Story