MODI: తెలంగాణ అభివృద్ధికి నిరంతర కృషి

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధి అని నమ్ముతున్నామని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. 9 వేల 21 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను వర్చువల్‌గా చేశారు. తెలంగాణలో రెండోరోజు పర్యటనలో భాగంగా ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మొత్తం 9వేల 21 కోట్ల రూపాయల విలువ చేసే వివిధ కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 1,409 కోట్ల రూపాయలతో నిర్మించిన NH-161 'నాందేడ్-అఖోలా' జాతీయ రహదారిని ప్రధాని జాతికి అంకితం చేశారు. సంగారెడ్డి క్రాస్‌రోడ్డు నుంచి మదీనాగుడ వరకు 12వందల 98 కోట్ల రూపాయలతో NH-65ని 6 వరుసలుగా విస్తరించే పనులకు శంకుస్థాపన చేశారు. మెదక్ జిల్లాలో 399 కోట్లతో చేపడుతున్న NH-765D, మెదక్-ఎల్లారెడ్డి జాతీయ రహదారి విస్తరణ, 500 కోట్ల రూపాయలతో ఎల్లారెడ్డి-రుద్రూర్ విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో పౌర విమానయాన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసినట్టు ప్రధాని తెలిపారు. పదేళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపైందన్న ప్రధాని.. పలు కొత్త రైలు మార్గాలు, విద్యుద్దీకరణ పనులు చేపట్టినట్టు తెలిపారు. పలు కొత్త రైలు మార్గాలు, విద్యుద్దీకరణ పనులు చేపట్టామన్న మోదీ.. ఘట్‌కేసర్ -లింగంపల్లి MMTS రైలు సర్వీసు మొదలైందని వెల్లడించారు. పారాదీప్ - హైదరాబాద్ మధ్య పైప్‌పైన్ పనులు చేపట్టామన్న ఆయన... తద్వారా తక్కువ ఖర్చుతో పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు వీలు కలుగుతుందని వివరించారు.
తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని అన్నారు. అందులో భాగంగా సోమవారం ఆదిలాబాద్ నుంచి 56 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించినట్టు తెలిపారు. అంతకుముందు... ప్రధాని మోదీ సికింద్రాబాద్ మహంకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఘన చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో ప్రధానికి స్వాగతం పలికిన అర్చకులు.. ప్రత్యేక పూజలు చేసి.. తీర్థ, ప్రసాదాలు అందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com