Chandrababu : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు

Chandrababu :  రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు
అధినేతను విడుదల చేయాలంటూ పూజలు, ర్యాలీలు, దీక్షలు

చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ పాదయాత్రలు, కొవ్వొత్తుల ర్యాలీలు, జలదీక్షలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పలుచోట్ల పోలీసులు ఆంక్షలు విధిస్తున్నా వెరవకుండా తెలుగుదేశం కార్యకర్తలు ముందడుగు వేస్తున్నారు. టీడీపీ శ్రేణులు నియోజకవర్గాలలో నిరసన కార్యక్రమాలు, రిలే నిరాహార దీక్షలు కొనసాగించగా, పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. చంద్రబాబు విడుదల కోసం ఆలయాలు, చర్చిలు, దర్గాల్లో ప్రార్థనలు నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అనంతపురం జిల్లా నాయనపల్లెలో తెలుగుదేశం నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. అనంతపురం-తాడిపత్రి ప్రధాన రహదారిపై నల్ల బెలూన్లతో నిరసన తెలుపుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. రాయదుర్గంలో దీక్షలకు సీపీఐ నాయకుడు జగదీశ్‌, మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌ సంఘీభావం తెలిపారు.


కదిరిలో రిలే దీక్షలు సాగుతున్నాయి. కోవెలగుట్టపల్లి గంగమ్మ ఆలయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత చిత్రావతి నదిలో జలదీక్ష చేపట్టారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దీక్షలు చేస్తున్న తెలుగుదేశం నాయకులు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు మండలం ఎర్రనీళ్ల కుంటలో తెలుగుదేశం నాయకులు జలదీక్ష చేశారు. కమలాపురం దీక్షల్లో పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కడప పోలేరమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి... 101 టెంకాయలు కొట్టారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో T.N.S.F ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. కర్నూలులో కళ్లకు గంతలు కట్టుకుని నల్లబెలూన్లు ఎగరేసి నిరసన తెలిపారు. నంద్యాల దీక్షల్లో ఆర్య వైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెం మండలం ఊటుకూరులో తెలుగుదేశం నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నందిగామ వద్ద మునేరులో నల్ల జెండాలతో జలదీక్ష చేశారు.


మైలవరం దీక్షా శిబిరాన్ని సందర్శించిన మాజీ మంత్రి దేవినేని ఉమా.. పార్టీ నాయకులకు సంఘీభావం తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరులో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుకు శత్రుదోషాలు తొలగిపోవాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ... నాగాయలంక మండలం సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. అంబేడ్కర్‌ కోనసీమ జల్లా కేంద్రం అమలాపురంలో పోలీసు ఆంక్షల నడమే... తెలుగు మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. పి.గన్నవరం నిరసన దీక్షల్లో సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముమ్మిడివరంలో 3 కిలోమీటర్ల మేర కాగడాల ర్యాలీ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో తెలుగు మహిళలు... కళ్ళకు గంతలు కట్టుకుని నూటొక్క బిందెల నీళ్లతో గ్రామంలో ర్యాలీ చేశారు. ఆ తర్వాత గ్రామదేవత బోయాలమ్మ తల్లికి పూజలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story