PULIVENDULA: జగన్ కంచుకోటపై ఎగిరిన పసుపు జెండా

వైఎస్ కుటుంబ కంచుకోట బద్దలైంది. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో టీడీపి పసుపు జెండా ఎగరేసింది. వైసీపీ కంచుకోటగా ఉన్న స్థానాలను కైవసం చేసుకోవాలన్న కూటమి పార్టీల నిర్విరామ కృషికి పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు పట్టం కట్టారు. 35 ఏళ్ల తర్వాత ఈ రెండు స్థానాల్లో పసుపు జెండా ఎగిరింది. జగన్ కంచుకోట బద్దలు కావడంతో ఇప్పుడు వైసీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది.
వైసీపీకి ఘోర పరాభవం
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ఆమె 6,035 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. వైసీపీకి 683 ఓట్లు లభించాయి. స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్‌కు 100 లోపు ఓట్లు లభించాయి. ఈ స్థానానికి టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 11 మంది పోటీపడ్డారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో 74 శాతం ఓటింగ్ నమోదైంది. పులివెందులలో టీడీపీ తొలిసారి విజయం సాధించగా.. అదే ఫలితాలను ఒంటిమిట్టలోనూ రిపీట్ చేసింది. టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి గెలుపు బావుటా ఎగురవేశారు. టీడీపీ అభ్యర్థికి 12, 780 ఓట్లు రాగా... వైసీపీకి అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్లతో విజయం సాధించాడు. పులివెందుల అభ్యర్థి డిపాజిట్ తెచ్చుకోకపోయినా... ఒంటిమిట్టలో మాత్రం వైసీపికి డిపాజిట్ దక్కింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com