Breaking: ఏపీ చీఫ్ గా నందమూరి ఆడబిడ్డ

ఎన్నికలకు ఏడాది ముందు ఏపీ బీజేపీలో పార్టీ హైకమాండ్ భారీ ప్రక్షాళన చేసింది. పార్టీ పగ్గాలను కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి అప్పగించింది. ఇటీవలే పార్టీలో చేరిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఒడిశా ఇన్‌చార్జ్‌గా.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పురందేశ్వరికి రాష్ట్ర పార్టీ పగ్గాలను అప్పగించారు.
ఓ వైపు టీడీపీ, జనసేన ఒక్కటై పోరాడుతుడటం.. మరో వైపు కాంగ్రెస్ షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచన చేస్తుండటంతో.. బీజేపీ హైకమాండ్ వ్యూహం మార్చింది. పురందేశ్వరి లాంటి బలమైన నేతకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ద్వారా ఏపీలో బలపడాలని చూస్తోంది. ఇటీవలే పార్టీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి బీజేపీ హైకమాండ్ ప్రాధాన్యం ఇచ్చింది. రాయలసీమలో బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో కిరణ్ కుమార్‌రెడ్డి పార్టీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు ఆశించినంత రీతిలో పని చేయలేదన్న భావనలో జాతీయ నాయకత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు సోమువీర్రాజును అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. సోము వీర్రాజు బీజేపీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆయన తీరుపట్ల సొంత పార్టీ నాయకులే ఆగ్రహంగా ఉన్నారు. గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ విషయంలో సోము వీర్రాజు వైఖరి వివాదాస్పదమైంది.
సోమువీర్రాజు అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఒకానొక దశలో సోమువీర్రాజు వైసీపీ కోవర్టు అన్న తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పలు విషయాలలో వైసీపీ ప్రభుత్వానికి వత్తాసు పలికేలా సోము వీర్రాజు వ్యవహరించాన్న టాక్ వినిపించింది. బీజేపీ జాతీయ నాయకత్వం అమరావతికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. సోము వీర్రాజు మాత్రం సొంత ఏజెండాతో పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
2018 ఎన్నికల తర్వాత పురందేశ్వరి, సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లాంటి కీలక నేతలు బీజేపీలో చేరినా.. దాన్ని క్యాష్ చేసుకొని పార్టీ బలోపేతం కోసం కృషి చేయలేదన్న టాక్ ఉంది. ఏపీలో పార్టీ మరింత చతికల పడటానికి సోము వీర్రాజు ప్రధాన కారణమని హైకమాండ్ భావించడంతోనే ఆయన్ను తొలగించినట్లు తెలుస్తోంది. బీజేపీ సంప్రదాయానికి భిన్నంగా ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించడం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com