R Krishnaiah: వైసీపీకి ఊహించని దెబ్బ

వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీసీ సంక్షేమ సంఘ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఆర్. కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్లో ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయినట్లు రాజ్యసభ కార్యాలయం బులెటిన్ విడుదల చేసింది. ఆర్. కృష్ణయ్య బీజేపీలో చేరుతారని.. సొంతంగా పార్టీ పెడతారని ఊహాగానాలు వస్తున్నాయి. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆర్. కృష్ణయ్య వెల్లడించారు. 100 బీసీ సంఘాలతో చర్చించిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీసీల సంక్షేమం, రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామని వెల్లడించారు. ఇంకా నాలుగేళ్ల పదవీ కాలం ఉందని.. అయినా బీసీల కోసం పదవిని వదులుకున్నానని అన్నారు. వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న కృష్ణయ్య.. అనూహ్యంగా రాజీనామా చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోందని అన్నారు. 9 నెలలు గడిచినా ఇప్పటికీ రిజర్వేషన్లు పెంచలేదన్న కృష్ణయ్య.. బీసీ ఉద్యమం కోసం పదవిని త్యాగం చేసినట్లు తెలిపారు. తెలంగాణలో బీసీ ఉద్యమం పతాక స్థాయికి చేరిందని కృష్ణయ్య తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉంటూ.. బీసీ రిజర్వేషన్లకు మద్దతిచ్చే పార్టీలో కలిసి పనిచేస్తానని ప్రకటించారు.
రాజ్యసభలో 8కి పడిపోయిన వైసీపీ బలం
ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ కీలక నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్. కృష్ణయ్య కూడా రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం 11 నుంచి 8కి పడిపోయింది. ఇప్పటికే రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు వైసీపీకి రాజీనామా చేశారు. మరికొందరు ఎంపీలు కూడా రాజీనామా దిశగా ఆలోచిస్తుండటం వైసీపీని ఇబ్బంది పెడుతోంది.
గతంలో ఇలా
ఆర్. కృష్ణయ్య గతంలో టీడీపీ నుంచి ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే 2018 ఎన్నికల్లో టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరిన కృష్ణయ్య.. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే బీసీ నేత కావడం, బీసీ హక్కుల కోసం పోరాడుతూ ఉండటంతో 2022 లో వైఎస్ జగన్.. ఆర్. కృష్ణయ్యకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చారు. అయితే పదవీకాలం మరో నాలుగేళ్లు ఉండగానే ఆయన తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరోవైపు ఆర్. కృష్ణయ్య తెలంగాణ బీజేపీలో చేరతారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com