రణరంగంగా మారిన అమరావతి

రణరంగంగా మారిన అమరావతి
ఆర్5 జోన్‌ను రద్దు చేయాలంటూ మందడం, తుళ్లూరు దీక్షా శిబిరాల్లో రైతులు, మహిళలు వినూత్నంగా ఆందోళన చేపట్టారు.

రాజధాని అమరావతి మరోసారి రణరంగంగా మారింది. అమరావతి ప్రాంతంలో సెంటు పట్టాల పంపిణీని నిరసిస్తూ రాజధాని రైతులు కదం తొక్కారు. ఆర్5 జోన్‌ను రద్దు చేయాలంటూ మందడం, తుళ్లూరు దీక్షా శిబిరాల్లో రైతులు, మహిళలు వినూత్నంగా ఆందోళన చేపట్టారు. మెడకు ఉరితాడు బిగించుకొని ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలతో హోరెత్తించారు. నల్ల జెండాలు పట్టి.. నల్లబ్యాడ్జీలు ధరించి నల్లబెలూన్లు ఎగురవేశారు. గో బ్యాక్, గో బ్యాక్ రాజధాని ద్రోహులు అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. జగన్‌కు వ్యతిరేకంగా రాజధాని రైతుల నినాదాలు చేశారు.

రాజధాని దీక్షా శిబిరాల్లో శాంతియుతంగా ధర్నా చేస్తున్న అమరావతి రైతులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సీఎం జగన్‌ అమరావతిలో పర్యటనకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనను అడ్డుకున్నారు. రోప్‌లు కట్టి కట్టడి చేసేందుకు యత్నించారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగి.. ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల ఓవరాక్షన్‌తో అమరావతి ప్రాంతంలో మరోసారి హైటెన్షన్ నెలకొంది.

జగన్ సర్కారు, పోలీసుల తీరుపై రాజధాని రైతులు, మహిళలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతి అభివృద్ధికి ఎన్నడు రాని జగన్ రాజధాని వినాశనానికి వచ్చారని రైతులు మండిపడ్డారు. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను జగన్ దెబ్బ తీస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. సెంట్ భూములు పేరుతో పేదల జీవితాలతో కూడా ఆడుకుంటున్నారని విమర్శించారు. సెంటు స్థలాలు పొందే వారిలో చాలామంది వైసీపీ కార్యకర్తలు ఉన్నారంటూ అమరావతి రైతులు ఆరోపించారు. కారులో తిరిగే వారికి, ఖరీదైన సొంతిల్లు ఉన్నవారికి సెంటు స్థలాలు మంజూరు చేస్తున్నారంటూ రైతులు మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story