Radha Death Case: ప్రకాశం జిల్లా మిస్టరీ మర్డర్‌లో మరో ట్విస్ట్... భర్త పైనే అనుమానాలు

Radha Death Case: ప్రకాశం జిల్లా మిస్టరీ మర్డర్‌లో మరో ట్విస్ట్...  భర్త పైనే అనుమానాలు
X

ప్రకాశం జిల్లా మిస్టరీ మర్డర్‌లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.రాధ భర్త మోహన్‌రెడ్డిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మోహన్‌ రెడ్డే ఆమెను కిరాతకంగా హతమార్చినట్లు సమాచారం.పోలీసులు కూడా ఇదే ధ్రువీకరించారు.ఉద్యోగం కోల్పోయి కష్టాల్లో ఉన్న ఫ్రెండ్‌కి హెల్ప్‌ చేసేందుకు 80 లక్షల వరకు అప్పు ఇవ్వడం, ఆ డబ్బు తిరిగి రాక పోవడంతో భార్యాభర్తల మధ్య కొన్నాళ్లుగా తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే కాశిరెడ్డితో ఆమెకు సన్నిహిత సంబంధం ఉందంటూ మోహన్‌ రెడ్డి అనుమానించాడు. కాశిరెడ్డిపేరుతోనే తన భార్యతో సెల్‌ఫోన్‌లో ఛాటింగ్‌ చేసినట్టుగా గుర్తించినట్లు తెలుస్తోంది. డబ్బులిస్తామని అతని పేరుతోనే మేసేజ్‌ పంపి ఈ నెల 17న ఆమెను స్వగ్రామం నుంచి కనిగిరి రప్పించాడు. అనంతరం రాధను కారులో తీసుకెళ్లి తీవ్రంగా హింసించి హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.

అయితే మొదట రాధ దగ్గర అప్పు తీసుకున్న ఆమె చిన్ననాటి స్నేహితుడు కేతిరెడ్డి కాశిరెడ్డి డబ్బు ఇస్తాను రమ్మని నమ్మకంగా పిలిపించి కిరాతకంగా అంతమొందించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాధ తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ ఇదే విషయం చెప్పారు. దీంతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కేసు అనూహ్యంగా మలుపు తిరిగింది.పామూరు బస్టాండు సెంటరులో వేచి ఉన్న రాధ దగ్గరకు వచ్చిన ఎరుపు రంగు కారు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. దీంతో రాధ భర్త మోహన్‌ రెడ్డిపై అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.మోహన్‌రెడ్డి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.


మరోవైపు భార్య రాధను హత్య చేసేందుకు మోహన్‌ రెడ్డి పక్కా ప్లాన్‌ వేశాడు. హైదరాబాద్‌లోని ఒక ట్రావెల్స్ కారును అద్దెకు తీసుకున్నాడు. అక్కడే చెరకు రసం అమ్మే మహిళ దగ్గర ఫోన్ చేసుకుంటానని సెల్ తీసుకొని అందులోని సిమ్‌ తీసి ఆమెకు తిరిగి ఫోన్ ఇచ్చాడు. ఆ సిమ్‌ను తన ఫోన్‌లో వేసుకొని రాధతో ఆమె స్నేహితుడి కాశిరెడ్డి పేరుతో రెండు రోజులు చాటింగ్ చేశాడు. డబ్బులు పంపిస్తున్నాను కనిగిరికి రమ్మని ఆమెకు మెసేజ్ చేశాడు. దీంతో కనిగిరిలోని పామూరు బస్టాండ్ సెంటర్కు వచ్చిన రాధను కొందరు వ్యక్తులు కారులో ఎక్కించుకొని టిడ్కో ఇళ్ల వద్దకు తీసుకెళ్లి హత్య చేశారు.తరువాత వెలిగండ్ల అడ్డరోడ్డు దగ్గరలో ఆమె మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్లారు.

ఇక రాధ మృతదేహానికి పోస్టుమార్టం చేసే సమయంలో అమె భర్తను పోలీసులు విచారించారు.అయితే ఎలాంటి అనుమానం లేకుండా సమాధానం చెప్పడంతో పాటు ఆమె మృతదేహాన్ని కోదాడ తీసుకెళ్లి అంత్యక్రియలు కూడా చేశారు. అయితే కాశిరెడ్డితో పోలీసులు ఫోన్‌లో మాట్లాడిన తర్వాత పోలీసులు మరో కోణంలో విచారణ ప్రారంభించారు. కీలక ఆధారాలు కూడా రాధ భర్తనే అనుమానించాయి.దీంతో మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.

Tags

Next Story