సీఎం సెక్యులర్..అన్యమతస్తుల భావాలను గౌరవిస్తారని నమ్ముతున్నా :రఘురామ

ఏపీ సర్కార్ తీరుపై ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. అంతర్వేధిలో రథం దగ్ధం.. దుర్గగుడిలో మూడు సింహాలు మాయం.. పలు ప్రాంతాల్లో దేవుడి విగ్రాహాలు ధ్వంసం లాంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. రోజు రోజుకూ హింధూ ధర్మంపై దాడి పెరుగుతోందని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి.. ఇదే సమయంలో టీటీడీ చైర్మన్ మరో వివాదాస్పద నిర్ణయాన్ని తెరపైకి తీసుకొచ్చి.. విమర్శలకు మరింత ఆజ్యం పోశారు. శ్రీవారిపై భక్తి విశ్వాసాలతో తిరుమలకు వచ్చే అన్యమతస్థులు స్వామివారిని దర్శించుకునేందుకు ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ప్రకటించారు. ఎప్పటి నుంచి వస్తున్న సంప్రదాయానికి విరుద్ధంగా ఆయన ప్రకటన ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీటీడీ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. మన సంస్కృతికి మూలం సనాతన ధర్మమేనని అన్నారు . సనాతనం అంటే ప్రాచీనమైన, నిత్యమైన, ఏనాటికి మారని శాశ్వత ధర్మమని.. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుండడం దారుణమంటూ ట్వీట్ చేశారు. సనాతన ధర్మ, సంప్రదాయాలు పాలకులు మారినప్పుడల్లా మారవంటూ వ్యాఖ్యానించారు. ఎవరైనా స్వామిపై నమ్మకంతో రావడం కోసమే టీటీడీలో అన్యమతస్తులు డిక్లరేషన్లు ఇచ్చే సంప్రదాయాన్ని పెట్టారని చంద్రబాబు గుర్తు చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో గత దశాబ్దాలుగా వస్తున్న డిక్లరేషన్ ను సీఎం పాటించకపోవడం సరైంది కాదన్నారు ఎంపి రఘురామకృష్ణంరాజు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలు సైతం డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శించుకున్నారని ఆయన గుర్తుచేశారు. సీఎం సెక్యులర్ అని భావిస్తున్నానని.. ఇప్పటికైనా అన్యమతస్తుల భావాలను గౌరవిస్తారని నమ్ముతున్నానన్నారు.
టీటీడీ చైర్మన్ నిర్ణయంపై తీవ్రంగా మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు. భారత రత్న అబ్దుల్ కలామ్ లాంటి వారే టీటీడీని సందర్శించిన సమయంలో రిజిస్టర్‌లో సంతకం పెట్టి వెంకన్న స్వామిని దర్శించుకున్నారని.. ఇది యావత్ భారతదేశంలో అందరి అన్యమతస్థులకు వర్తించే అంశమంటూ ట్వీట్ చేశారు. డిక్లరేషన్ అవసరం లేదని టీటీడీ చైర్మన్ ప్రస్తావించడం అనాలోచిత వైఖరి అన్నారు సోమువీర్రాజు.
హిందూ దేవాలయాల్లో అన్యమతస్తులకు డిక్లరేషన్ అవసరం లేదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందని.. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం హిందుత్వానికి వ్యతిరేకంగా పాలన సాగిస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దేవాలయాలపై రోజు రోజుకూ దాడులు పెరుగుతున్నాయి.. ముఖ్యంగా అన్యమత ప్రాచారం పెరిగిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో టీటీడీ తీసుకున్న నిర్ణయంతో ధార్మిక సంఘాలు, భక్తులు వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అన్యమతస్థులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం తీరు ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి..