RAGHURAMA CASE: రఘురామ కేసులో కీలక మలుపు-ఐపీఎస్ అరెస్ట్

రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను గుంటూరు నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు బీహార్‌లో తలదాచుకున్న ఆయనను ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన సమయంలో కస్టడీలో అమానుషంగా భౌతిక దాడి జరిగిందన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. అప్పట్లో సీఐడీ విభాగంలో పనిచేసిన సునీల్ నాయక్, రఘురామపై జరిగిన దాడిలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. రఘురామకృష్ణరాజు తనపై కస్టడీలో హింస జరిగిందని ఆరోపిస్తూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది.
ఇటీవల కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. విచారణలో భాగంగా పలువురు ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో సునీల్ నాయక్ ఆచూకీపై కీలక సమాచారం లభించింది. ఆయన బీహార్‌లో ఉన్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో గుంటూరు నగరంపాలెం పోలీసుల స్పెషల్ టీమ్ అక్కడికి వెళ్లి ఆపరేషన్ నిర్వహించింది. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సునీల్ నాయక్ అరెస్ట్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, ఆయన అరెస్ట్ మరిన్ని కీలక విషయాలను వెలుగులోకి తెచ్చే అవకాశముందని భావిస్తున్నారు. పోలీసు వర్గాల్లో కూడా ఈ పరిణామం చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం సునీల్ నాయక్‌ను ట్రాన్సిట్ రిమాండ్‌పై ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఆయనను విచారించి మరిన్ని వివరాలు సేకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకుని, అప్పట్లో జరిగిన ఘటనలపై పూర్తి స్థాయి నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
